రైతు స్థాయిలో విత్తనోత్పత్తి
● స్వయంగా తయారు చేస్తే లాభదాయకం
● జాగ్రత్తలు పాటించాలంటున్న ఏడీఏ ఎన్.మోహనరావు ● విత్తనోత్పత్తికి ఎంపిక చేసుకునే పొలంలో గతంలో అదే రకం వరి సాగు చేయని విత్తనాలను ఎంచుకుంటే కల్తీ మొక్కలు, కేళీలు వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
● ఎంపిక చేసిన నారు మడికి ఇతర రకాల నారు మడులు సుమారు 3 నుంచి 5 మీటర్లు దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. లేదా పక్క పొలంలోని పంట కాల వ్యవధిలో 15 నుంచి 30 రోజుల తేడా ఉండేలా చూసుకోవాలి. లేదంటే విత్తుకునే సమయంలో 20 నుంచి 30 రోజుల కాలవ్యవధి పాటించినట్‌లైతే వేరు రకంతో చాలా వరకు సంపర్కాన్ని నిరోధించవచ్చు.
● పిలకల దశలో వరి ఆకుల రంగు, ఎత్తును బట్టి కేళీలు గుర్తించి వేరు చేయాలి. పూత దశలో కేళీలను గుర్తించి తొలగించడం సులభం. జాగ్రత్తగా వ్యవహరిస్తే కల్తీ లేని విత్తనాన్ని పొందవచ్చు.
● గింజకట్టే దశలో, పలచదనం, చిక్కదనం, గొలుసులోని గింజల్లో గమనించి కేళీలను ఏరివేయాలి.
● వరి కోత అనంతరం శుభ్రమైన గచ్చుపైన విత్తనాన్ని 4 నుంచి 5 రోజుల పాటు ఆరబెట్టాలి. తేమ శాతం 12 శాతం కంటే తక్కువ వచ్చే వరకు ఆరబెట్టాలి. రాత్రి పూట టార్పాలిన్ పట్టలు కప్పి ఉంచినట్‌లైతే మరింత తేమ శాతం రాకుండా నివారించుకోవచ్చు.
● ఈ విత్తనాన్ని గాలికి తూర్పార పట్టాలి. తద్వారా తాలు గింజలు, ఇతర కలుపు గింజలు, రంగుమారిన గింజలు వేరు అవుతాయి.
● అంతిమంగా లభించిన నాణ్యమైన విత్తనాన్ని కొత్త గోనె సంచుల్లోకి ఎత్తి తదుపరి పంట కోసం నిల్వ చేసుకోవాలి.
● రైతులు స్వయంగా విత్తనోత్పత్తి చేసుకోవడం ద్వారా విత్తనాలు కొనడానికి అధిక పెట్టుబడి పెట్టడం తప్పుతోంది. కల్తీ విత్తనాలు కొని నష్టపోవడాన్ని నివారించుకోవచ్చు.
● విత్తనోత్పత్తి ద్వారా తయారు చేసిన విత్తనాన్ని విత్తుకునే 10 రోజుల ముందు విత్తన మొలక శాతం లెక్క కట్టుకోవాలి.
● 100 గింజలను ఒక రోజు నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు తడిగుడ్డలో కట్టి రెండు రోజుల తర్వాత మొలకెత్తిన విత్తనాలను లెక్కించి 80 కంటే ఎక్కువ మొలకలు ఉంటే నాణ్యమైన విత్తనంగా పరిగణించి వాడుకోవాలి.
కొరిటెపాడు(గుంటూరు): వానా కాలం(ఖరీఫ్) సాగు ముగిసింది. వరి కోతలు ప్రారంభం కానున్నాయి. రైతులు దిగుబడిని ధాన్యంగా కాకుండా విత్తనాలుగా తయారు చేసుకుంటే లాభదాయకమని గుంటూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు(ఏడీఏ) ఎన్.మోహనరావు తెలిపారు. మొదటగా వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కానీ, ఇతర గుర్తింపు పొందిన సంస్థల నుంచి కానీ విత్తనాన్ని సేకరించుకోవాలి. పొలంలో వేసి తదుపరి సంతతి విత్తనాన్ని పొందవచ్చు. వచ్చిన దిగుబడిని విత్తనంగా పరిగణించి వాడుకోవడమే కాకుండా గ్రామంలోని తోటి రైతులకు సరళమైన ధరలకు అందించవచ్చు. తదుపరి ఆ విత్తనం ద్వారా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వరకు విత్తనోత్పత్తి చేసుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..