
పురస్కారమూ పెద్ద ప్రహసనమే!
తెనాలి: సాహిత్య, కళారంగాల్లోని ప్రముఖుల కృషికి తగిన గుర్తింపునిచ్చి ప్రభుత్వం తరఫున అవార్డులతో ప్రోత్సహించడం సంప్రదాయంగా వస్తోంది. రచయితలు, కళాకారులు ఆయా రంగాల్లో వారు చేసిన కృషి సామాజిక వికాసానికి, పురోగమనానికి దోహదపడే స్థాయిని అనుసరించి పురస్కారాలకు ఎంపిక చేస్తుంటారు. ఇందుకోసం గతంలో గౌరవప్రదమైన విధివిధానాలుండేవి. ఆయా రంగాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, సలహా సంఘాలు పనిచేసేవి. సాహిత్య, కళాప్రక్రియల్లోని విశిష్ట రచనలు, ప్రదర్శనలను పరిశీలించి అర్హులను గుర్తించి గౌరవ పురస్కారాలను అందజేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉగాది, కళారత్న, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తి, గుర్రం జాషువా పురస్కారాలు ఈ కోవలోనివి.
రాజకీయ జోక్యం
ఈ పురస్కారాల ప్రదానం కోసం రచయితలు, కళాకారులు, భాషాప్రముఖుల ఎంపికలో పక్షపాతం చూపుతోంది కూటమి సర్కారు. వారి సృజన, కృషి, సేవలు వంటివి పక్కకు పోయాయి. ప్రభుత్వం రాజకీయ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతిభావంతులైన రచయితలు, కళాకారుల రాజకీయ భావజాలాన్ని, వారి రాజకీయ కార్యాచరణను అధికార పార్టీ కిందిస్థాయి రాజకీయ కార్యకర్తల ద్వారా విచారణ చేయిస్తోంది. అక్కడక్కడా రచయితలు, కళాకారుల ఇళ్లకు వెళ్లి ఇంటర్వ్యూలతో ఆయా వివరాలను సేకరిస్తున్నారు. తర్వాతనే అవార్డులకు ఎంపిక చేస్తున్నారు.
ఇవిగో నిదర్శనాలు...
ఇంతకుముందు ఉగాది/కళారత్న అవార్డుల ఎంపిక ప్రక్రియల్లో తెనాలికి చెందిన ప్రముఖ కళాకారిణిని అవార్డుకు ఎంపిక చేశారు. ఆమె తండ్రి ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుడనే కారణంగా చివరి నిమిషంలో రద్దు చేసినట్టు అప్పట్లో బహిరంగంగానే విమర్శలొచ్చాయి. అలాగే శుక్రవారం ప్రదానం చేసిన భాషా అవార్డుల విషయంలోనూ ఇదే తీరు కొనసాగింది. రాత్రివేళ ఫోన్లు చేసి, ‘మీరు ఫలానా కదా! మీ రాజకీయ వైఖరి ఏంటి’ అంటూ విచారించినట్టు సమాచారం. పురస్కారానికి ఎంపికై నట్లు చెప్పి, వెంటనే రావాలని ఫోనులో సమాచారం చేరవేస్తున్నారు. నిర్ణీత వ్యవధిలో దూరప్రాంతాల వారు కొందరు అవార్డులను స్వయంగా స్వీకరించలేకపోతున్నారు. ఉగాది/కళారత్న అవార్డులనే కాదు... శుక్రవారం భాషా దినోత్సవ అవార్డుల కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి. రాలేని వారు సంబంధిత కార్యాలయం నుంచి తర్వాత స్వీకరించాలని చెబుతున్నారట!
నేతల సిఫార్సులు
తాము చేసిన రచనలు, కళలు, కళారూపాల గురించి ప్రముఖులే ఏకరువు పెట్టుకోవాల్సి వస్తోంది. ఆశావహులు తమ దరఖాస్తులకు సంబంధిత ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలను జత చేయిస్తున్నారు. రచయితలకు రచనా ప్రక్రియల్లో, నాటక, నృత్య, సంగీత విభాగాల్లో సంబంధిత ప్రముఖులకే పురస్కారాలను ప్రదానం చేయాలనేది అందరి భావన.
కూటమి ప్రభుత్వం వచ్చాక సాహిత్య, కళా రంగాల్లో అవార్డుల ప్రకటన కూడా ప్రహసనంగా మారింది. ఎంపికకు నిర్దిష్ట ప్రక్రియ, విధివిధానాలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులను గౌరవించటం మాట అలా ఉంచి, అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆవేదన చెందుతున్నారు. పక్షపాతం, రాజకీయ జోక్యంతోపాటు అవార్డుల ప్రదానానికి కొద్ది గంటల ముందు వరకు రహస్యంగా ఉంచటం, రాత్రి పొద్దుపోయాక ఫోను సమాచారం ఇవ్వటం వలన ప్రదానోత్సవ సభకు సంబంధిత ప్రముఖులు వెళ్లలేని నిస్సహాయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.