
ఆర్‌బీకేల ద్వారా యూరియా సరఫరా చేయాలి
ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి
తాడేపల్లిరూరల్: రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాను రైతులకు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద కౌలు, రైతు సంఘాల నాయకులతో కలసి యూరియా కొరతపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి, రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తోందని అన్నారు. ఎరువులపై ఇచ్చే సబ్సిడీ తగ్గించేందుకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా యూరియాను కృత్రిమ కొరత సృష్టించడం, రైతులను మోసం చేయడమేనని అన్నారు. జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ వంటి పంటలు వేసిన రైతులకు యూరియా తక్షణమే అవసరం ఉందన్నారు. తక్షణమే యూరియాను అందుబాటులో తీసుకువచ్చి రైతులకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై చిత్తశుద్ధి ఉంటే నానో యూరియాను కాకుండా రైతులు కోరే యూరియాను సరఫరా చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, రైతు సంఘం సీనియర్ నాయకులు వై. కేశశరావు, రైతు సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, హేమలత, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్, జిల్లా నాయకులు కాజా వెంకటేశ్వరరావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.