
గ్రీన్ గ్రేస్‌లో ఘనంగా భాషా దినోత్సవం
కొరిటెపాడు(గుంటూరు): గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవాలను పట్టాభిపురంలోని భజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలోని గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టు ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పండితులకు పరిమితమైన గ్రాంధిక భాష స్థానంలో సామాన్యులకు సైతం వ్యవహారంలోకి తీసుకొచ్చి తెలుగు భాషను అభివృద్ధి చేసిన ఘనుడిగా గిడుగు రామ్మూర్తి పేరు గడించారని పేర్కొన్నారు. రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించడం అభినందనీయన్నారు. ఆయన చేసిన కృషితో ఆధునిక భాష పండితుల నుంచి పామరుల వరకు విస్తృత ప్రచారంలోకి వచ్చిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు పాఠ్యపుస్తకాలు, బోధన, చదువు వాడుక భాషలో ఉండటం వల్ల ఆత్మ విశ్వాసంతో చదువులు సాగించి ఎందరో సామాన్యులు అత్యున్నత పదవులు, దేశ విదేశాల్లో గౌరవాలు సాధించారన్నారు. తదనంతరం రామ్మూర్తికి లభించిన బిరుదులు, వారి సేవలను గుర్తించిన పలువురు ప్రముఖుల మాటలను గుర్తు చేశారు. కార్యక్రమంలో భజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు సిద్దినేని శ్రీనివాసరావు, సమీర్ నందన్, ప్రాజెక్టు మేనేజర్ దురై, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.