
అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
గుంటూరు లీగల్: జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్,జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి పేర్కొన్నారు. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్‌ల ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్‌పై వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఎక్కువ సంఖ్యలో క్రిమినల్, సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. దీనికి అందరూ సహకరించాలని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై.సూర్య నారాయణలు స్టేక్ హోల్డర్లకు సలహాలు, సూచనలు ఇచ్చారు.
బాల్య వివాహాలతో చేటు
బాల్య వివాహాలు, గిరిజన మహిళలలో ఎర్లీ ప్రెగ్నన్సీపై జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు గురువారం గుంటూరు సుగాలికాలనీ విద్యానగర్‌లో సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని తెలిపారు. త్వరగా పెళ్లి చేస్తే బాలికలకు మానసిక, శారీరకంగా పలు రకాల ఇబ్బందులు కూడా తలెత్తుతాయని గుర్తుచేశారు. తగిన వయస్సు వచ్చేవరకు వారు చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఇక గిరిజనుల్లో ఎర్లీ ప్రెగ్నన్సీకి చదువుకోక పోవడమే ప్రధాన కారణమని గుర్తుచేశారు. అక్షరాస్యత పెంచి వారిని చదువుల బాట పట్టిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.