
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
నగరంపాలెం: మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలకు సంబంధించి కేసుల్లో పెండింగ్‌లోని నాన్ బెయిల్‌బుల్ వారెంట్లను అమలు చేయాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణంలోని హాల్‌లో జూలై నెలకు సంబంధించి నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లాలో నమోదైన పలు నేరాలపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. దర్యాప్తు, నేర నియంత్రణ చర్యలపై పోలీస్ అధికారులకు ముఖ్య సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. నాన్ బెయిల్‌బుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని చెప్పారు. చిన్నారులు, మహిళల అదృశ్యాల కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. హత్యలు, అత్యాచారాలు, ఆస్తి సంబంధిత నేరాల కేసుల్లో దర్యాప్తును ప్రాధాన్యంగా తీసుకుని చార్జిషీట్‌లు దాఖలు చేయాలని ఆదేశించారు. వైట్ కాలర్ మోసాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. నేర నియంత్రణకు కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), రవికుమార్ (ఎల్‌ఓ), డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.