
నగదు రహిత వైద్య సేవలు అందించాలి
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశాలు
లక్ష్మీపురం: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ, ఈహెచ్‌ఎస్ పేషెంట్లకు నగదు రహిత వైద్యం అందేలా అన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో డీఆర్‌సీ సమావేశ మందిరంలో గురువారం డిసిప్లినరీ కమిటీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 87 ఫిర్యాదులపై విచారణ జరిపి వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పేషెంట్లకు నగదు రహిత వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఈహెచ్‌ఎస్ కింద ఉద్యోగులు, పెన్షనర్స్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు వచ్చినప్పుడు వైద్య సేవలు తిరస్కరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో వైద్యసేవలు పొందే రోగులకు మందులు, పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి అనుసంధానమైన సెంటర్లకు మాత్రమే పంపించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. విజయలక్ష్మి, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ విజయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.