
గంజాయి వినియోగిస్తున్న ఐదుగురి అరెస్ట్
1.15 కేజీల గంజాయి స్వాధీనం
తెనాలి రూరల్: త్రీ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి వినియోగిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్‌లో సీఐ ఎస్. రమేష్‌బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.... బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మకు చెందిన ఖాళీ స్థలంలో కొందరు గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో మహేంద్రదేవ్ కాలనీకి చెందిన పాలడుగు బాలకృష్ణ, గంగానమ్మపేటకు చెందిన సయ్యద్ ముజాయిద్, వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన పోతార్లంక కార్తీక్, బాలాజీరావుపేటకు చెందిన యలవర్తి శివకుమార్, చెంచుపేటకు చెందిన షేక్ సమీర్ హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పాలడుగు బాలకృష్ణ, సయ్యద్ ముజాయిద్ ఒడిశా నుంచి గంజాయి తెచ్చి మిగిలిన నిందితులతో కలిసి తెనాలి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. గంజాయికి బానిసలైనట్లు తెలిస్తే తల్లిదండ్రులు వెంటనే పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకొస్తే కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైతే రిహాబిలిటేషన్ సెంటర్‌లకు పంపనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.