
సాక్షి,తాడేపల్లి: సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది. ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?’అని వైఎస్సార్‌సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ క్రెడిట్ తనదేనంటూ పవన్ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై పోతిన మహేష్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట మాట్లాడటం ఆయనకే చెల్లింది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసిందే జగన్. పవన్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీ గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు?.
సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీని గురించి జనసేన ఎమ్మెల్యేలు అడుగుతారనే పవన్ కళ్యాణ్ వారికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నేతల జోక్యం గురించి మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని సొంత ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వలేదు.
సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది.ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?. వైఎస్ జగన్ మాత్రమే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. పొలం, నగదు, ఉద్యోగం ఇచ్చింది జగనే. కానీ ఆ క్రెడిట్ ని కూడా పవన్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. అసలు ఆ కేసును త్వరగా ఎందుకు తేల్చటం లేదో పవనే సమాధానం చెప్పాలి?.విచారణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?.చంద్రబాబు హయాంలో డీఎన్‌ఏలు మార్చి ఉంటారు.దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?
పవన్ కళ్యాణ్ చంద్రబాబు చొక్కా పట్టుకుని ఎందుకు నిలదీయలేదు?.సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకుని సుగాలి ప్రీతి అంశం మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాని నియంత్రించాలని చట్టం తెస్తారట. హోంమంత్రి పదవిని తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును విచారించాలి.
వచ్చే 15ఏళ్లు చంద్రబాబు పల్లకి మోయాలని పవన్ అంటున్నారు. జనసైనికులు దీనిపై ఆలోచించుకోవాలి. జనసేన సైనికులందరినీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారు.రుషికొండ భవనాలు ప్రభుత్వానివేనని పవన్ అంగీకరించారు. అమరావతిలో భూములు లాక్కోవటం వలనే పర్యావరణం దెబ్బ తిన్నదని పవన్ నర్మగర్భంగా చంద్రబాబును అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించే అన్నారని’ పోతిన మహేష్ స్పష్టం చేశారు.