
పొగాకు కొనుగోలు నిరంతరం జరగాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో రైతుల నుంచి పొగాకు కొనుగోలు ప్రక్రియ నిరంతరం జరగాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయనన మాట్లాడారు. ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు కంపెనీలు కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో 3,895 మంది రైతులు పొగాకు సాగు చేయగా, 3,370 మంది రైతులు ప్రభుత్వానికి విక్రయించేందుకు సీఎం యాప్‌లో నమోదు చేసుకున్నారని జేసీ వెల్లడించారు. కొనుగోలు కోసం ఇప్పటి వరకు 1,614 మంది రైతులకు షెడ్యూల్ ఇచ్చారని తెలిపారు. ఏపీ మార్కెట్‌మార్క్‌ఫెడ్ ద్వారా 1063 మంది రైతుల నుంచి ప్రభుత్వం 2,200 టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. ప్రైవేటు కంపెనీలు కూడా 3,500 టన్నులు కొనుగోలు చేశాయని తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన 2,800 టన్నుల పొగాకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ టి.నరసింహారెడ్డి, పొగాకు రైతులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ