
ఓటరు పరిశీలన సమర్థంగా నిర్వహించాలి
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: ప్రశాంతమైన, పారదర్శకమైన ఎన్నికలకు ఓటరు పరిశీలన సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని బూత్ లెవల్ అధికారులందరికీ ఎన్నికల సంఘం వద్ద శిక్షణ పొందిన మాస్టర్‌తో శిక్షణ ఇప్పించామని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బూత్ లెవెల్ అధికారులందరూ ఓటరు దరఖాస్తులను మరింత మెరుగ్గా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు స్థానిక సంస్థల నుంచి ధ్రువీకరణ పత్రాలను సేకరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్–2026పై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు వచ్చిన వెంటనే బీఎల్వోలు డోర్ టు డోర్ వెళ్లి ఓటరు జాబితా వెరిఫికేషన్ చేస్తారని తెలిపారు. ఇటీవల సచివాలయం ఉద్యోగుల బదిలీలు జరిగిన నేపథ్యంలో బీఎల్వోల మార్పులు, చేర్పులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశామని చెప్పారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని వివరాలు అందజేయాలని ఆమె కోరారు. రాజకీయ పార్టీలు సహకారం, సూచనలను తప్పకుండా పరిగణలోనికి తీసుకుని అవకాశం ఉన్న వరకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి దరఖాస్తులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.