
ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీకి 80 ఏళ్ల చరిత్ర ఉందని, ఇక్కడ సీటు రావడం అదృష్టంగా భావించాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన 67 మంది ఫస్ట్ ఇయర్ వైద్య విద్యార్థులకు ఆయన మంగళవారం కాలేజీ అడ్మిషన్ కార్డులు అందజేశారు. వైద్య కళాశాలలో 250 సీట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. గుంటూరు వైద్య కళాశాలో అభ్యసించిన ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వైద్యులుగా సేవలందిస్తున్నారని చెప్పారు. ఎంతో మంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, కలెక్టర్‌లుగా, ఎంపీలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా, ఉన్నత పదవుల్లో పనిచేసి పద్మశ్రీ , పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు సైతం పొందారని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందిన వారంతా కష్టపడి చదివి కన్న తల్లిదండ్రులకు, వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, మంచి వైద్యులుగా సేవలందించాలని ఆయన వెల్లడించారు. వైద్య విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా ప్రతిరోజూ విద్యార్థులను గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, బోధన సిబ్బంది పాల్గొన్నారు.