
అక్రమ కేసులతో బీసీల అణచివేతకు కుట్ర
కూటమి పాలనలో అన్ని వర్గాలకు అవస్థలు వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
ధూళిపాళ్ల కక్ష
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : కూటమి ఏడాదిన్నర పాలనలో బీసీలు అన్ని రకాలుగా అణిచివేతకు గురవతున్నారని..వారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కేయాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. గుంటూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీతో కలిసి ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జలకళ కార్యక్రమంలో భాగంగా ఎంబుక్‌లో ఫోర్జరీ సంతకాలు చేశారని అభాండాలతో వైఎస్సార్ సీపీకి చెందిన పెదకాకాని ఎంపీపీ శ్రీనివాసరావుపై పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారని తెలిపారు. యాదవులు అంటే మంచితనానికి మారుపేరని..వారు మాట ఇచ్చారంటే దాని మీద నిలబడతారన్నారు. అటువంటి వారిపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని సూచించారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో ప్రథమ స్థానం కల్పించి పైకి తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి అక్రమ కేసులు పెట్టి వారిని అణగదొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఎంపీపీ శ్రీనివాసరావు శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేయిస్తే దాన్ని కూల్చివేయించిన ఎమ్మెల్యే దూళిపాళ్ల..అదే పొన్నూరు నియోజకవర్గం తక్కెళ్లపాడులో పెద్దఎత్తున వసూళ్లు చేసి శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారని వివరించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన తెలుగు రాష్ట్రాల్లోని యాదవులంతా ఏకమై హెచ్చరికలు చేశారన్నారు. అక్కడ విగ్రహాన్ని తొలగించి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అరాచకంతో, అధికారం ఉందని ఏదైనా చేయగలమని చూస్తే ప్రజలు చూస్తు ఊరుకోరని కారుమూరి చెప్పారు.
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీసీలపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినప్పటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అక్రమాలకు చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు.