
గడువులోపు అర్జీలకు పరిష్కారం
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
ఐదు రోజుల క్రితం ఇంటికి వెళ్లే క్రమంలో దుకాణం వద్ద ఆగాను. ఈ క్రమంలో టీడీపీ నేత సోదరుడు నా వద్దకు వచ్చి మద్యం ఇప్పించాలని బెదిరించాడు. నా వద్ద నగదు లేదని బదులిచ్చాను. నన్నే బూతులు తిడతావా అంటూ నాపై అతనితోపాటు కొందరు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈలోగా నా సోదరి, వారి పిల్లలు రాగా, వారిని సైతం అసభ్య పదజాలంతో ధూషించాడు. ఈ వివాదంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు నమోదు చేసినా, ఇప్పటి వరకు మాపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడి సోదరుడ్ని, అనుచరులను అరెస్ట్ చేయలేదు. అదేమని అడిగితే దాడికి పాల్పడిన వారు గుంటూరులో లేరని, పొరుగు రాష్ట్రంలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మాపై దాడికి పాల్పడిన వారంతా ఇళ్ల వద్దనే ఉంటున్నారు. ఇంకా మమ్మల్ని బెదిరిస్తున్నారు. న్యాయం చేయగలరు.
– కె.మరియదాస్, దాసరి విజయ,
సీఆర్‌నగర్, దాసరిపాలెం, గుంటూరు రూరల్
సుమారు తొమ్మిదేళ్ల క్రితం మాకు పెళ్లి అయింది. ఇద్దరు సంతానం. నెల రోజులుగా నా భార్యతో స్థానిక జనసేన కార్యకర్త ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అదేమని అడిగితే నన్ను, ఇద్దరు పిల్లలను చంపుతానని బెదిరించాడు. ఇది మా ప్రభుత్వమని, పోలీసులు తనను ఏం చేయలేరని బెదిరించాడు. గత రెండు రోజుల క్రితం నా భార్యను తీసుకుని వెళ్లిపోయాడు. ఇద్దరు చిన్నారులు తల్లి కోసం రోదిస్తున్నారు. నా భార్యను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి తీసుకెళ్లిన జనసేన కార్యకర్తపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కోరుతున్నా. – బాధితుడు, స్వర్ణభారతినగర్
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు – పరిష్కార వేదికలో బాధితుల నుంచి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. బాధితుల గోడు అలకించారు. చట్టపరమైన పరిధిలో నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు.
గత కొన్నాళ్లుగా దుకాణాలు నిర్వహిస్తున్నాం. ఇంటి యాజమాని 2017లో చనిపోయినా, క్రమం తప్పకుండా అద్దెలు చెల్లించాం. అయితే వ్యాపారం బాగా జరుగుతుందని, అదనపు అద్దె చెల్లించమని మాపై యజమాని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. లేదంటే దుకాణాలు కూల్చివేస్తామని బెదిరించారు. దీంతో కోర్టులో దావా దాఖలు చేశాం. ఈ ఏడాది నవంబర్ వరకు ఇంజషన్ ఆర్డర్ ఇచ్చారు. అయినప్పటికీ మమ్మల్ని బెదిరిస్తున్నారు. తమ దుకాణాల తాళాలు ఇప్పించాలని కోరుతున్నాం
– రామచంద్రరావు, షేక్ ఖాజావలి, గిరి, ఎస్‌వీఎన్ కాలనీ
నేను వైద్య విద్యను విదేశాల్లో అభ్యసించాలని నిర్ణయించుకున్నా. ఈ విషయమై మా ఇంట్లో అద్దెకు ఉండే వారికి ఎనిమిది నెలలు క్రితమే తెలియజేశాం. రెండు, మూడు నెలల్లో ఖాళీ చేస్తామని బదులిచ్చారు. అయితే నెలలు గడిచినా ఖాళీ చేయకపోగా మాపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అసభ్య పదజాలంతో ధూషిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జీఎంసీ నోటీసు మేరకు అక్రమంగా ఏర్పాటైన రేకులను తొలగించాం. ఈ క్రమంలో అద్దెకు ఉండే ఓ వ్యక్తి మాపై దాడికి యత్నించాడు. కోర్టులో స్టే లేకపోయినా ఉన్నట్లు హడావుడి స్పష్టిస్తున్నారు. మాకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు రాలేదు. మాపై దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యల్లేవు. దీనిపై విచారణ జరిపి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– ఫిలిప్స్ రూబెన్ భూమిక,
కృష్ణవేణి, ఎస్‌వీఎన్ కాలనీ