
బాల్య వివాహాల అనర్ధాలపై అవగాహన
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం బుడంపాడు ఎస్టీ కాలనీలో బాల్యవివాహాలు, గిరిజన మహిళల్లో ఎర్లీ ప్రెగ్నన్సీ పై వారం రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని ఆడ పిల్లలకు, 21 సంవత్సరాలు నిండని పురుషులకు వివాహాలు చేయరాదన్నారు. అలా చేయడం చట్టపరంగా నేరమన్నారు. ఆ వయసులో వారు శారీరకంగా, మానసికంగా వివాహాలకు సిద్ధంగా ఉండరని, చదువుకోవడం ముఖ్యమన్నారు. గిరిజన మహిళలు ఎర్లీ ప్రెగ్నెన్సీ వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, గిరిజన సంక్షేమశాఖ అధికారి రఘునాథ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయకుమార్, అధికారులు పాల్గొన్నారు.