
శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం తొలగింపు
పెదకాకాని: శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ వివాదానికి దారి తీయడంతో నిర్వాహకులు స్వచ్ఛందంగా రాత్రికి రాత్రే ఆ విగ్రహాన్ని తొలగించి వేరే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడులో ఈనెల 24వ తేదీన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ప్రకటించారు. సమాచారం అందుకున్న యాదవ సంఘం నేతలు, బీసీవై పార్టీ నేతలు 23వ తేదీన తక్కెళ్ళపాడులో విగ్రహావిష్కరణ వద్దకు చేరుకుని, ఎన్‌టీఆర్‌ను శ్రీకృష్ణుని రూపంలో ఆవిష్కరించడం అంటే శ్రీకృష్ణుడికి ప్రతి ఇంటా పూజలు చేసే యాదవ కులాన్ని, హిందువులను అవమానించడమేనని ఈ విగ్రహావిష్కరణ నిలిపివేయాలని స్థానికులను కోరారు. అయినప్పటికీ ఆదివారం మండల టీడీపీ, గ్రామ పెద్దలు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహం నుంచి పిల్లనగ్రోవి, నెమలి పింఛం తొలగించారు. మరోసారి అదే విగ్రహం చేతిలో కత్తి పెట్టారు. అదే రోజు సాయంత్రం నిరసన తెలియజేసేందుకు అక్కడికి చేరుకున్న యాదవ సంఘం నాయకులు, బీసీవై పార్టీ ప్రతినిధులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అప్పటికే బీసీవై పార్టీ అధినేత సోమవారం ఛలో తక్కెళ్ళపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా యాదవసంఘ ప్రముఖులు గుంటూరు నగరంలో సమావేశమయ్యారు. అలాగే తక్కెళ్ళపాడు గ్రామంలో టీడీపీ నాయకులు, విగ్రహావిష్కరణ కమిటీ సమావేశం నిర్వహించారు. వివాదాస్పద విగ్రహావిష్కరణ కులాలు, మతాల మధ్య సమస్యగా మారుతుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు.. ఆదివారం రాత్రి నిర్వాహకులు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న విగ్రహాన్ని స్వచ్ఛందంగా తొలగించారు. అదే స్థానంలో ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదాలకు తెరపడటంతో పాటు శాంతియుత వాతావరణం నెలకొంది. ఎటువంటి వివాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం తొలగింపు