
చెరువులో గల్లంతైన యువకుడు మృతి
కొల్లూరు: చెరువులో పడి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికి తీయించారు. సోమవారం రాత్రి కొల్లూరు శివారు బోస్‌నగర్‌లో సభావత్తు గోపీనాయక్ (34) గ్రామాన్ని అనుకొని ఉన్న చెరువులో పడి గల్లంతైన విషయం విదితమే. అతని పెద్దమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో చెరువులో పడిన వ్యక్తిని గమనించిన మహిళ స్థానికులను అప్రమత్తం చేసింది. స్థానికులు అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో కొల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి పోలీసులు గజ ఈతగాళ్లను చెరువులోకి దింపి గల్లంతైన యువకుడి కోసం గాలించారు. అర్ధరాత్రి సమయంలో మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ జానకీ అమరవర్ధన్ తెలిపారు.