
తమ్ముళ్ల లూటీ!
మున్సిపల్ అధికారుల అండతో పనుల్లో అడ్డగోలుగా దోపిడీ
రిజిస్ట్రేషన్ గడువు పూర్తయినా...
రూ.కోట్లలో
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు నగరంలో ఏ అభివృద్ధి పనైనా టెండర్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా, ఎవరైనా టెండరు వేయవచ్చు. తెలుగు తమ్ముళ్లు ఈ ప్రక్రియకు ఫుల్‌స్టాప్ పెట్టారు. వర్కులో బాగా మిగులుతుందని భావిస్తే చాలు టెండరింగ్ (ఈ–ప్రొక్యూర్‌మెంట్) ప్రక్రియలో పెట్టకుండా.. టెండర్ పాల్గొన్నట్లుగా నకిలీ డాక్యుమెంట్లు పుట్టిస్తున్నారు. దానికి నగర పాలక కమిషనర్ నుంచి ఆమోదం పొంది, వర్క్ ఆర్డర్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు కూడా చకాచకా ప్రాసెస్ చేసినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ అధికారుల అండదండలు ఉన్నందునే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారని తోటి కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థలో ఏ వర్కు తీసుకున్నా అది రూ.50 లక్షల నుంచి రూ.కోటిపైనే ఉంటుంది. ఈ ప్రొక్యుర్‌మెంట్ ద్వారా టెండర్లు నిర్వహించినప్పుడు సదరు వర్కులో లెస్‌కు పాడుకుని కొంతమంది వర్కులు చేస్తుంటారు. ఉదాహరణకు రూ.కోటి విలువైన ఒక పనికి టెండరు పిలిస్తే 20 శాతం లెస్‌కు ఎవరైనా వేస్తే రూ.80 లక్షలతో ఆ పని చేయాలి. కానీ ఇక్కడ విడ్డూరం ఏమిటంటే కావాలనే టెండర్ల ప్రక్రియలో ఎవరూ పాల్గొనకుండా చేసి, తమకు అనుకూలురైన టీడీపీ నేతలతో 20 శాతం లెస్ వేసినట్లు చూపిస్తారు. తరువాత అధికారులకు మామూళ్లను సమర్పించుకుంటున్నారు. ఇక అసలు పని అప్పుడు ప్రారంభం అవుతుంది. ఫైల్ ప్రాసెస్ చేసే సమయంలో 20 శాతం లెస్‌ను కాస్త 2.0 శాతంగా మార్పిస్తున్నారు. టెండర్ డాక్యుమెంట్‌లో మాత్రం 20 శాతం లెస్ వేసినట్లుగానే ఉంటుంది. అంటే రూ.20 లక్షలు తక్కువగా చూపించాల్సిన వర్కును రూ.రెండు లక్షలకు తగ్గించి చూపించి రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇదే తంతు 2014–19 మధ్య కూడా జరిగిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీని వలన కార్పొరేషన్‌కు రూ.10 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని సమాచారం.
ఏదైనా టెండర్ ప్రక్రియలో పాల్గొనాలంటే ప్రతి కాంట్రాక్టర్ తప్పనిసరిగా పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ, ఇంజినీరింగ్ అండ్ చీఫ్ నుంచి ఐదేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అప్పుడే వర్కు చేసుకోవాల్సి ఉంటుంది. నగరంలో ఓ కాంట్రాక్టర్‌కు రిజిస్ట్రేషన్ కాలపరిమితి పూర్తయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పాత సర్టిఫికెట్‌ను ట్యాంపరింగ్ చేసి వర్కుల్లో పాల్గొంటూ, బిల్లులు కూడా చేసుకుంటున్నారు. కొందరు దీనిపై ఫిర్యాదు చేయగా సదరు కాంట్రాక్టర్ చూపిన సర్టిఫికెట్‌లు ఆయా శాఖలకు చేరాయి. వాటిని తాము ఇవ్వలేదని పై అధికారుల నుంచి సమాధానం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజినీరింగ్ విభాగంలో అక్రమార్కులు కొత్త దందాలకు పాల్పడుతున్నారు.