
అర్జీల పరిష్కారంలో సమన్వయం అవసరం
డీఆర్వో ఖాజావలి
గుంటూరు వెస్ట్ : అర్జీల పరిష్కారంలో వివిధ శాఖల సమన్వయం చాలా ముఖ్యమని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాఖల మధ్య సమన్వయం లేకపోతే అర్జీల పరిష్కారం ఆలస్యమవుతుందని తెలిపారు. ప్రతి శాఖలో ఎన్ని అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయో అధికారులు అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. అర్జీల పరిష్కారంలో సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కోర్టు కేసులకు సంబంధించి ఆన్సర్లు నిర్ణీత గడువులోనే దాఖలు చేయాలని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను స్థానిక మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు కూడా ప్రతి వారం ఇవ్వొచ్చని సూచించారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం వచ్చిన 198 అర్జీలను డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.