భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం

Aug 14 2025 6:58 AM | Updated on Aug 14 2025 6:58 AM

భారీ

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరుణుడు రైతుల ఆశలను నిలువునా ముంచేశాడు. కొద్దిగంటల సమయంలోనే విరుచుకుపడ్డాడు. మంగళవారం రాత్రి పది గంటల నుంచి ప్రారంభమైన వాన తెల్లవారుజాముకు తెరిపిచ్చి, అనంతరం బుధవారం సాయంత్రం మొదలుకొని గురువారం తెల్లవారు జాము వరకు కురుస్తూనే ఉంది. బుధవారం ఉదయం నాటికే జిల్లాలో సగటున 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చేబ్రోలు మండలంలో అత్యధికంగా 23.4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గుంటూరు నగరం, మంగళగిరి, తెనాలి, పొన్నూరు పట్టణాలు అస్తవ్యస్తంగా మారాయి. గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ పలుమార్లు స్థంభించింది.

పొంగిన వాగులు

కాజా టోల్‌గేటు వద్ద జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. టోల్‌ప్లాజా వద్ద మూడు అడుగుల వరకు నీరు ఉండడంతో గుంటూరు నుంచి విజయవాడ వైపు ద్విచక్రవాహనాలు వెళ్లే లైన్‌తో పాటు మరో రెండు లైన్లను నిలిపివేశారు. దీంతో వాహనాలు నెమ్మదిగా పంపించే క్రమంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. టోల్‌గేటు వద్ద వున్న ఫుడ్‌ప్లాజా రెస్టారెంట్‌లోకి వర్షపు నీరు చేరింది. రాజధాని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది. నీరు పోయే మార్గం లేకపోవడంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. లాం వద్ద కొండవీడువాగు పొంగడంతో ఉదయం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఆడుకుంటూ వరదనీరు ప్రవహిస్తున్న డ్రైన్‌లో పడి నేలపాటి యోహన్‌(14) అనే బాలుడు మృతి చెందాడు.

నీళ్లలో అండర్‌ బ్రిడ్జిలు.. ట్రాఫిక్‌ కష్టాలు

గుంటూరు నగరంలో పలుప్రాంతాలు నీటమునిగాయి. మూడొంతెనలు, కంకరగుట్ట అండర్‌బ్రిడ్జిల వద్ద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కార్పొరేషన్‌ కార్యాలయంలోకి మురుగునీరు వచ్చి చేరింది. దీంతో మోటార్ల సాయంతో వాటిని బెయిల్‌ అవుట్‌ చేయాల్సి వచ్చింది. రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలోకి వర్షపు నీరు చేరడంతో వ్యాపారస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.

కొద్ది గంటల్లోనే 14 సెంటీమీటర్ల వర్షపాతం ఉప్పొంగిన వాగులు, వంకలు భారీగా నీట మునిగిన పంటలు జిల్లాలో 72,612 ఎకరాల్లో దెబ్బతిన్న వైనం పుట్టెటు కష్టంలో అన్నదాతలు జలమయంగా కాజా టోల్‌గేట్‌ గుంటూరు నగర రోడ్లపై భారీగా వర్షం నీరు.. ట్రాఫిక్‌ అంతరాయం మరో రెండురోజులు భారీ వర్షసూచన నంబూరులో వరదనీటిలో పడి బాలుడు మృతి

జిల్లావ్యాప్తంగా జోరు వాన

పొన్నూరులో వర్షంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. డీవీసీ కాలనీ, ఏడో వార్డు, పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. పెదకాకాని మండలంలో నంబూరు, గోళ్ళమూడి గ్రామాలకు వెళ్లే రహదారుల్లో వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వెనిగండ్ల చెంచుకాలనీ గుడిసెలను వర్షపునీరు చుట్టుముట్టింది. గుంటూరు ఛానల్‌(కొత్తకాలువ) పంట కాలువకు గండి పడటంతో నీరు పొలాల్లోకి చేరుతోంది.

మంగళగిరి నగరంలో భారీ వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. నగర పరిధిలోని ఇందిరానగర్‌, కొత్తపేట, రత్నాలచెరువు, లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, బాపనయ్యనగర్‌, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో నివాసితులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎన్‌ఆర్‌ఐ వైద్యశాల వద్ద రహదారి కోతకు గురికావడంతో రోడ్డుపైకి రెండు అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచిపోయింది. టిడ్కో గృహ సముదాయంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండల పరిధిలో వేల ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, గుంటూరు రూరల్‌ మండలాల్లో అకాల వర్షానికి వరి, పత్తి, అపరాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రవాణా వ్యవస్థ స్థంభించింది. గ్రామాల్లో ప్రధాన రహదారులపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిపోయాయి. చెరువులు, కుంటలు వరద నీటితో నింగిపోయా. పలు రోడ్లకు వర్షపు నీటితో రోడ్లు కొట్టుకు పోయాయి.

తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలంలో వేమవరం, కండ్రిక, ఆరోగ్యనగర్‌, జగనన్న కాలనీలకు వెళ్లే రైల్వే అండర్‌పాస్‌ల వద్ద నీరు చేరడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తెనాలి పట్టణంలో మారీసుపేట, నందుపేట, ఐతానగర్‌, చినరావూరు. యడ్లలింగయ్య కాలనీ, బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, చెంచుపేట, ఇందిరానగర్‌ కాలనీ, ఉడా కాలనీ, పూలే కాలనీ తదితర ప్రాంతాలలోని పలు రోడ్లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. తెనాలిలో వరి పంట పెద్ద మొత్తంలో నీట మునిగింది. నియోజకవర్గంలో అన్నిచోట్లా వరిపైరు 30–40 రోజుల దశలో ఉంది. ఈ తరుణంలో కురిసిన భారీ వర్షంతో దాదాపు 12 వేల ఎకరాల్లో వర్షపునీరు నిలిచింది. కొలకలూరు, హాఫ్‌పేట, ఖాజీపేట, నందివెలుగు, కఠెవరం, కంచర్లపాలెం, అంగలకుదురు, సంగం జాగర్లమూడితోపాటు కొల్లిపర మండలంలో పలుగ్రామాల్లో పంటలు నీట మునిగాయి.

71,612 ఎకరాల్లో వరి, పత్తి, మినుము పంటలు నీట మునక

కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలకు 71,612 ఎకరాల్లో వరి, పత్తి, మినుము పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటిలో 11 మండలాల్లోని 88 గ్రామాల్లోని 28,437 మంది రైతులకు చెందిన వరి 62,275 ఎకరాలు, నాలుగు మండలాల్లో 16 గ్రామాలకు చెందిన 3,475 మంది రైతులకు చెందిన పత్తి 8,550 ఎకరాలు, రెండు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో 315 మంది రైతులకు చెందిన మినుము 787.5 ఎకరాల్లో నీట మునిగినట్లు గుర్తించారు. వర్షాలు తగ్గి నీరు బయటకు వెళ్లిన తర్వాత ఎన్యుమరేషన్‌ చేసి నివేదికను జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు తెలిపారు. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం1
1/7

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం2
2/7

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం3
3/7

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం4
4/7

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం5
5/7

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం6
6/7

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం7
7/7

భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement