
నేడు పాఠశాలలకు సెలవు
గుంటూరు ఎడ్యుకేషన్: భారీ వర్షాల దృష్ట్యా గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సి.వి.రేణుక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు విధిగా సెలవు దినంగా పాటించాలని ఆదేశించారు.
వరద ఉధృతిని
పరిశీలించిన సబ్ కలెక్టర్
తాడేపల్లిరూరల్ : ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు బుధవారం ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తెనాలి సబ్‌కలెక్టర్ సంజనా సింహ, తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య ఇరిగేషన్ శాఖ అధికారులతో కలసి కృష్ణానది పుష్కర ఘాట్ల వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని ఆమె ఆదేశించారు. వరద నీటిలోకి ఎవరూ దిగకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
మూడు రోజుల పాటు మార్కెట్ షాపుల బహిరంగ వేలం
నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ షాపుల బహిరంగ వేలం ఈ నెల 18, 19, 20 తేదీలలో నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరంలో రాష్ట్ర గవర్నర్ పర్యటన, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల వల్ల వాయిదా పడిన షాపుల వేలాన్ని నిబంధనల మేరకు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగినవారు పాల్గొనాలని సూచించారు.
లోతట్టు ప్రాంత ప్రజలు తరలింపు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): కృష్ణా నది పరీవాహక గ్రామాల్లోని ప్రజలను, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనితకు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి వంగలపూడి అనిత భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో కలక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంత్రి వంగలపూడి అనిత తో మాట్లాడుతూ గుంటూరు చానల్ ఓవర్ ఫ్లో కారణంగా నంబూరులోని లోతట్టు కాలనీల్లో వరద నీరు చేరినందున 150 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. తాడికొండ మండలం గరికపాడు, బేతాజ్‌పురంలలో కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తున్నందున 75 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, మందులు అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల్లో వర్షపాతం అధికంగా నమోదైందన్నారు. కొల్లిపర మండలంలో పంట నష్టం అధికంగా ఉందన్నారు. తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో బోటు తీసుకు రావడానికి వెళ్ళిన ముగ్గురు మత్య్సకారులలో ఇద్దరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారని, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ద్వారా వారిని రక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గుంటూరు ఆర్డీగా
డాక్టర్ శోభారాణి
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా డాక్టర్ జి.శోభారాణిని నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి. హోస్‌మణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్‌ఏసీ) ఆర్డీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డీవోగా పనిచేస్తున్న డాక్టర్ కె.సుచిత్రను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేసి, అక్కడ రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డాక్టర్ జి.శోభరాణి గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియలిస్టుగా పనిచేస్తున్నారు. గతంలో డాక్టర్ శోభరాణి గుంటూరు ఆర్డీగా పనిచేశారు.

నేడు పాఠశాలలకు సెలవు