
త్యాగధనుల పోరాటంతోనే స్వాతంత్య్రం
పట్నంబజారు: త్యాగధనుల పోరాటాల ఫలితమే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు చెప్పారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వెన్నల పతాకాన్ని ఆవిష్కరించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రజలు కోరుకున్న వారే పరిపాలకులుగా ఉండాలన్నది రాజ్యాంగం సు స్పష్టం చేసిందన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో ఎన్నికలు కుట్రలు, కుతంత్రాలతో జరిగాయని మండిపడ్డారు. పోలీసులు, పాలకులు, ఎన్నికల అధికారులు కుమ్మకై ్క ఓటింగ్ ప్రక్రియ జరపడం సిగ్గుచేటన్నారు. స్థానికంగా లేని వ్యక్తులను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందన్నారు. ప్రజలకు పూర్తి విషయాలు తెలియాలంటే వెబ్ కెమెరాల విజువల్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన విచారణ చేయించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి సర్కార్ సూపర్ సిక్స్– సూపర్ హిట్ అని చెప్పటం విడ్డూరంగా ఉందని, సూపర్ సిక్స్ –సూపర్ ఛీట్ అని విమర్శించారు. ప్రమాదకర పరిస్థితుల్లో నేటి ప్రజాస్వామ్యం ఉందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం అంటే దేశానికి పండుగ రోజని, మువ్వన్నెల జెండాను దేశ ప్రజలంతా ఎగురవేసి అమరవీరులను స్మరించుకోవాలన్నారు. నేడు రాష్ట్రంలో ఓటు వేసే స్వాతంత్య్రం కూడా లేకుండా పోయిందన్నారు. రిగ్గింగులు, బూత్ క్యాప్చర్ చేసి టీడీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే స్వాతంత్య్ర దినోత్సవం అలంకార ప్రాయంగా నిలిచే అవకాశం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉందని, కూటమి తప్పులను ఖండించాలన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ వేడుక చేసుకునే గొప్ప పండుగ స్వాతంత్య్ర దినోత్సవమన్నారు. పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగమే మన స్వాతంత్య్రమన్నారు. నేటి యువత ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మకాయల రాజానారాయణ, షేక్ గులాం రసూల్, వంగల వలివీరారెడ్డి, మండేపూడి పురుషోత్తం, కొత్తా చిన్నపరెడ్డి, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, పఠాన్ సైదాఖాన్, నందేటి రాజేష్, బూరెల నాంచారమ్మ, సురసాని వెంకటరెడ్డి పాల్గొన్నారు.