
నంబూరు చప్టాలో పడి విద్యార్థి మృతి
పెదకాకాని: ఓ విద్యార్థిని చప్టాలో ప్రవహిస్తున్న నీరు మృత్యు రూపంలో మింగేసింది. ఈ ఘటన నంబూరు గ్రామంలోని విజయభాస్కర్‌నగర్‌లో బుధవారం జరిగింది. పెదకాకాని మండలం నంబూరు విజయభాస్కర్ నగర్‌కు చెందిన నేలపాటి సురేష్‌బాబు, ఎస్తేరురాణి దంపతులకు యోహాన్, షారోన్‌లు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యోహాన్ 8వ తరగతి, చిన్న కుమారుడు షారోన్ 5వ తరగతి చదువుతున్నాడు. నంబూరు గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పిల్లలతో పాటు బయట ఆడుకుంటున్న యోహాన్ మరికొందరు కాజ రోడ్డులో ఉన్న చప్టాపైపు వెళ్ళారు. మురుగు చెరువు నీటి ఉధృతికి యోహాన్ కాలుజారి చప్టాలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలించారు. అప్పటికే నీట మునిగిన యోహాన్ (14) మరణించాడు. ఆడుకునేందుకు బయటకు వెళ్లిన కొడుకు నిమిషాల వ్యవధిలోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.