గుంటూరు ఎడ్యుకేషన్ : స్థానిక శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ దృష్ట్యా సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. ‘ఏపీ క్‌లైమెట్ యాక్షన్ క్యాంపెయిన్ అండ్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ’ ప్రచార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభిస్తారు.
ఈ నేపథ్యంలో వేంకటేశ్వర విజ్ఞాన మందిరాన్ని సందర్శించిన కలెక్టర్ సీటింగ్ ఏర్పాట్లపై అధికారులతో పాటు రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులతో చర్చించారు. కార్యక్రమంలో జేసీ ఏ.భార్గవ్‌తేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వైబీ రామారావు, కోశాధికారి పి. రామచంద్రరాజు, తూర్పు మండల తహసీల్దార్ సుభానీ ఇతర అధికారులు పాల్గొన్నారు.
మున్సిపల్ రెండవ వైస్ చైర్మన్ రాజీనామా ఆమోదం
చీరాల: చీరాల మున్సిపల్ రెండవ వైస్ చైర్మన్ శిఖాకొల్లి రామసుబ్బులు గత నెల 14న తన పదవికి రాజీనామా చేస్తూ కమిషనర్‌కు లేఖను అందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన రామసుబ్బులు వైస్ చైర్మన్ పదవికి సంబంధించిన రాజీనామాపై సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించారు. త్వరలో వైస్ చైర్మన్–2ను భర్తీ చేస్తామని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో పలు సమస్యలు ఉన్నాయని, ప్రధానంగా డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు.
సెలవు దినాల్లో గ్రీవెన్స్ ఉండదు
తాడికొండ: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ‘గ్రీవెన్స్’ కార్యక్రమం ప్రభుత్వ సెలవు దినాలలో జరగదని కమిషనర్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు, ఆ రోజు కార్యక్రమం ఉందన్నారు. రాజధాని రైతులు, భూ యజమానులు తమ వినతులు, ఫిర్యాదులు ఆన్‌లైనన్‌లో పరిష్కారం పోర్టల్ ద్వారా ఎప్పుడైనా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం తీవ్రనష్టం
యడ్లపాడు: కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దేశానికి తీవ్ర నష్టమని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు హెచ్చరించారు. రైతు ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత పోపూరి రామారావు 6వ వర్ధంతి, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సభ స్థానిక పీఆర్ విజ్ఞాన కేంద్రంలో నూతలపాటి కాళిదాసు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. కేశవరావు మాట్లాడుతూ పోపూరి రామారావుతో సుదీర్ఘకాలం రైతు ఉద్యమంలో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సేవలను స్మరించుకున్నారు. ఆలోకం పెద్దబ్బాయి, ప్రొఫెసర్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
బాలిక వివాహాన్ని నిలిపివేసిన అధికారులు
ఊటుకూరు(క్రోసూరు) : ఊటుకూరు గ్రామంలో సోమవారం మైనర్ వివాహం జరుగుతుందన్న సమాచారం మేరకు ఐసీడీఎస్ సెక్టార్ సూపర్‌వైజర్ ఎం.వెంకటలక్ష్మీ, ఎంపీడీవో రవికుమార్ వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయికి 19 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేయాలని తెలిపారు. బాల్యవివాహ నిరోధక చట్టం ప్రకారం పెళ్లికి సహకరించిన ప్రతి ఒక్కరు శిక్షార్హులేనని అన్నారు. ఈ సందర్భంగా తల్లిని, మేనమామను బైండోవర్ చేశారు.

గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్