
ధూళిపాళ్ల మనిషినంటూ బెదిరింపులు
మద్యం తాగొచ్చి చిత్రహింసలు
భర్త నుంచి రక్షణ కల్పించాలని మహిళ వేడుకోలు
పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన
ఫ్లెక్సీ చేతపట్టుకుని జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట నిరసన
సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీడీపీ జెండా పట్టుకుంటే చాలు.. ఎంతటి మోసం, అన్యాయం, అక్రమమైనా చేయొచ్చనే భావనతో పొన్నూరులో పచ్చ పార్టీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కుడి భుజం(రైట్ హ్యాండ్) అని చెబుతూ తిరిగే తన భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఓ మహిళ వాపోయింది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడు సార్లు, స్థానిక పొన్నూరు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ... పొన్నూరు మండలం అలూరు గ్రామానికి చెందిన తనకు సుమారు ఎనిమిదేళ్ల క్రితం పౌల్‌రాజుతో ప్రేమ వివాహమైందని చెప్పారు. భర్త పంచాయితీ పనులకెళ్తూ, ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కుడి భుజమని చెబుతున్నాడని పేర్కొన్నారు. కట్నకానుకల కింద పాండ్రపాడులోని రెండెకరాల పొలం, పది తులాల బంగారం తమవారు ఇచ్చారని పేర్కొన్నారు. ఆరేళ్ల క్రితం కొంత పొలాన్ని రూ.19 లక్షలకు విక్రయించి రాజకీయాల్లో తిరిగి ఖర్చు చేశాడని తెలిపారు. మరో ఎకరం విక్రయించేందుకు అంగీకరించకుంటే కాపురానికి రానివ్వ బోనని, తనను, తన బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నాడని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఎవరికై నా దీనిపై ఫిర్యాదు చేసినా చంపేస్తానని, తర్వాత స్టేషన్లో లొంగిపోతానని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పేరు చెప్పి తీవ్రంగా బెదిరించేవాడని కన్నీరు మున్నీరయ్యారు. గత నెల 11వ తేదీన మరణాయుధంతో దాడికి పాల్పడగా, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. భర్త వద్దనే తమ కుమార్తె కూడా ఉందని పేర్కొన్నారు. తనకు కుమార్తెను అప్పగించాలని వేడుకున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భర్త, అతని కుటుంబ సభ్యుల నుంచి తనను, తన వారిని కాపాడి న్యాయం చేయాలని కోరారు.
ఆస్తుల కోసమే తనను పెళ్లి చేసుకున్నట్లు భర్త పలుమార్లు చెప్పాడని బాధితురాలు వివరించారు. తక్కువ కులం దానినంటూ నోటికొచ్చినట్లు ధూషించేవాడని వాపోయారు. చిత్రహింసలకు గురిచేయడంతోపాటు, తన కుటుంబ సభ్యులను ఇంటికి రానిచ్చేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో మాట్లాడటానికి కూడా అంగీకరించేవాడు కాదని వాపోయారు. స్నేహితులతో కలిసి నిత్యం మద్యం తాగొచ్చి, వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వేధించేవాడని తెలిపారు.