
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడండి
పట్నంబజారు: నగరంలో శంకర్‌విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కంకరగుంట అండర్‌పాస్, బ్రాడీపేట 4వ లైను, శంకర్‌విలాస్ సెంటర్, డొంకరోడ్డు, మూడు వంతెనలు, రంగాబొమ్మ సెంటర్, కొత్తపేట శివాలయం సెంటర్, భగత్‌సింగ్ సెంటర్, డీమార్ట్, నాజ్ సెంటర్, ఉమెన్స్ కళాశాల రోడ్డు, ఎంటీబీ సెంటర్‌లలో బైక్‌పై ఆయన పర్యటించారు. వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ ఏ అశోక్‌కుమార్‌లకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిలవకుండా సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. వాహనదారులకు సమన్వయంతో ట్రాఫిక్ డైవర్షన్‌ల గురించి వివరించాలని, వారు తప్పక పాటించేలా చూడాలని ఆదేశించారు.
సహనంతో విధులు నిర్వర్తించాలి
ట్రాఫిక్ నెమ్మదించినా.. కొద్దిపాటి ఇబ్బందులు కలిగినా.. సహనం పాటించాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. వ్యాపార సముదాయాల వారు తమ కస్టమర్ల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. వాహనదారులు రోడ్డుపై కాకుండా నిర్ణీత పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపేలా చూసుకోవాలన్నారు. మళ్లింపులకు సంబంధించి సూచిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సీఐలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అవసరమైన చోట సిబ్బందిని అధికంగా కేటాయించటం, ముఖ్యమైన కూడళ్లపై దృష్టి సారించాలన్నారు. వెంట అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, ట్రాఫిక్ ఎస్సై సాంబశివరావునాయక్ తదితరులు ఉన్నారు.