
సమర దీప్తి... తెనాలి స్ఫూర్తి
దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం మహత్తర ఘట్టం. ఈ పోరాటంలో తెనాలివాసుల సాహసం, బ్రిటిష్ పోలీసులపై చూపిన తెగువ, బలిదానం జాతీయ స్థాయిని సైతం ఆకర్షించాయి. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖితమైంది.
తెనాలి: స్వాతంత్య్ర పోరాటంలో తెల్లదొరలు దేశం విడిచివెళ్లాలనే నినాదమే ‘క్విట్ ఇండియా’. 1942 ఆగస్టు 8న ముంబయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సంఘం కార్యవర్గం ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపునకు యావత్ భారతం వెంటనే స్పందించింది. ఆగస్టు 9న దేశంలోని అనేక నగరాల్లో హర్తాళ్ జరిగింది. ముంబయి సమావేశంలో పాల్గొన్న తెనాలి ప్రముఖులు కల్లూరి చంద్రమౌళి, వెలువోలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు, అవుతు సుబ్బారెడ్డి, శరణు రామస్వామిలు 11వ తేదీన తిరిగొచ్చారు. ఆ రోజే ఇక్కడి ఓల్ట్ టౌన్‌లోని వెర్రెయ్య గారి మేడలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆగస్టు 12న తెనాలి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. నాయకులను అరెస్టు చేశారు. కాంగ్రెస్‌వాదులు, తెనాలి తాలూకా హైస్కూలు, భారత్ ట్యుటోరియల్ కాలేజీ విద్యార్థులు పట్టణ బంద్‌కు సిద్ధమయ్యారు. ఆగస్టు 12న తెల్లవారేసరికి తెనాలి జనసంద్రమైంది. కల్లూరి చంద్రమౌళి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నన్నపనేని వెంకట్రావు, కార్యదర్శి రావి అమ్మయ్య నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారు.
రైల్వేస్టేషనులో విధ్వంసం
రైల్వేస్టేషను సమీపంలోని బంద్ పాటించని హోటల్‌కు ప్రదర్శకులు వెళ్లి సామగ్రిని బయటపడేశారు. రైల్వేస్టేషనులో పండ్లదుకాణం, హోటల్‌నూ మూయించారు. అక్కడే స్పెన్సరు క్యాంటీనులో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. నార్త్ క్యాబిన్ దగ్గర్లోని ఆయిల్ ట్యాంకరుకు నిప్పటించారు. ఉవ్వెత్తున ఎగసిన మంటలకు ఉద్వేగ భరితులైన ప్రదర్శకుల దృష్టి ప్లాట్‌ఫాం పక్కన ఆగివున్న గూడ్స్ వ్యాగన్లపై పడింది. రెండు వ్యాగన్లలోని షాహి డక్కన్ సిగరెట్ల బండిల్స్‌ను ప్లాట్‌ఫాంపై వేసి తగులబెట్టారు. మరో రెండు వ్యాగన్లలోని విదేశీ మద్యం సీసాలు గల కార్టన్లను, ఇంకో వ్యాగనులోని నూలు కండెల్ని తగులబెట్టారు. ఈలోగా మరో బృందం బుకింగ్ ఆఫీసులోకి ప్రవేశించింది. అక్కడి టికెట్లను, నగదును గుట్టగా పోసి దహనం చేశారు. నగదును ఎవరూ ముట్టుకోలేదు. అప్పటికి మద్రాసు నుంచి పూరి ప్యాసింజరు రైలు వచ్చి ప్లాట్‌ఫాంపై ఆగింది. ప్రయాణికులు దిగాక నాలుగు బోగీల్లో కిరోసిన్ పోసి ఉద్యమకారులు నిప్పంటించారు.

సమర దీప్తి... తెనాలి స్ఫూర్తి