పచ్చిరొట్ట పైరుతో ఎన్నో ప్రయోజనాలు
వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు
తెనాలి టౌన్: ఖరీఫ్ సాగుకు ముందు పచ్చిరొట్ట పైరు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ రాష్ట్ర సంచాలకులు ఎస్.ఢిల్లీరావు రైతులకు సూచించారు. రూరల్ మండలం ఎరుకలపూడి గ్రామంలో రైతు ముళ్ళపూడి రంగయ్య ప్రయోగాత్మకంగా చేపట్టిన పీఎండీఎస్ క్షేత్రాన్ని బుధవారం పలువురు అధికారులతో కలిసి ఎస్.ఢిల్లీరావు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సంస్థ ఎన్నో సంవత్సరాలు పరిశోధించి 32 రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని సాగు చేయడం వలన సేంద్రియ కర్బనం భూమిలో పెరుగుతుందని తెలిపారు. ఎరువుల వినియోగం కూడా తగ్గించుకోవచ్చని వివరించారు. జనుము, జీలుగ, పిల్లి పెసర విత్తనాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం వలన కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందుల ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చని అన్నారు. భూమి గుల్లబారి ఆరోగ్యంగా ఉంటుందని, సూక్ష్మపోషకాలు త్వరగా పంటకు అందుతాయని తెలిపారు. ప్రతి రైతును చైతన్యపరచాలని, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, ఏడీఏ ఎన్.ఉషారాణి, ఏవో జి.ప్రేమ్‌సాగర్, ఏఈవోలు, వీఏఏలు, పలువురు రైతులు పాల్గొన్నారు.


