అది ఆత్మహత్య కాదు..!
యడ్లపాడు: మండలంలోని కొండవీడు రెవెన్యూ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ప్రేమజంట ఆత్మహత్యాయత్నం ఘటనపై బుధవారం యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ ఘటనలో దాసరిపాలెం గ్రామానికి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి కొర్నెపాటి తేజ(19) కొండగట్టుపై నుంచి క్వారీనీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, తన కుమారుడిది ఆత్మహత్య కాదని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తేజ తండ్రి కొర్నెపాటి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మే 5వ తేదీ రాత్రి తేజ స్నేహితుడు కోటిరెడ్డితో కలిసి చౌడవరం శివారులోని ప్రైవేటు వసతి గృహంలో ఉన్న మిత్రుడి గదికి చదువుకోడానికి వెళ్లాడు. మంగళవారం ఉదయం స్నేహితులు తండ్రి మహేష్ వద్దకు వచ్చి తేజ, కీర్తనలు ప్రేమలో ఉన్నారని, పెద్దల నిరాకరణతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. వారిద్దరూ చౌడవరం బాలకుటీర్ పాఠశాల వెనుక ఉన్న క్వారీ నీటి గుంటలో దూకారని చెప్పిన స్నేహితులు, కీర్తనను అప్పటికప్పుడు కాపాడినట్లు మహేష్‌కు చెప్పారు. అయితే, తేజ కనిపించకపోవడంతో తండ్రి సంఘటనా స్థలానికి చేరుకుని కుంట వద్ద తేజ చెప్పులు గుర్తించాడు. స్థానికుల సహాయంతో గుంటలో నీటిని తోడించగా మృతదేహం వెలికి తీశారు. ఈ సంఘటనపై తేజ తండ్రి కుమారుడి మృతిపై కీర్తనతో పాటు స్నేహితులు కోటిరెడ్డి, చందులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబానికి అప్పగించారు.
నా కుమారుడి మృతిపై
సమగ్ర దర్యాప్తు జరపండి
క్వారీ కుంటలో పడి మృతి చెందిన తేజ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు
కేసు నమోదు చేసుకున్న
యడ్లపాడు పోలీసులు


