ప్రకృతి సాగు.. లాభాలు బాగు
కొరిటెపాడు(గుంటూరు): భూతాపం తగ్గాలన్నా.. భూసారం పెరగాలన్నా.. తినే ఆహారం ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా రైతులంతా తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రసాయనిక ఎరువుల వలన భూసారం క్రమేపీ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఆ భూములను మళ్లీ సారవంతంగా చేయాలంటే రైతులంతా ప్రకృతి వ్యవసాయం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఖరీఫ్ సీజన్‌కు ముందే నవధాన్యాల సాగు చేయాలి. ప్రకృతి వ్యవసాయం సిబ్బంది సుమారు 12 కిలోల బరువున్న నవధాన్యాల విత్తనాల కిట్లను రూ.1200లకు అందజేస్తున్నారు. ఈ కిట్‌లో 30 రకాల విత్తనాలు ఉంటాయి. ఇలా మిశ్రమ విత్తనాల సాగువల్ల భూమిలో జీవ వైవిధ్యం పెరిగి భూమి సారవంతం అవుతోంది. గుంటూరు జిల్లాలో గతేడాది 25,475 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 50 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
సాగు చేసే విధానం ఇలా..
వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే పొలంలో నవ ధాన్యాలు చల్లు కోవాలి. ఇవి వేసిన 45 రోజుల వ్యవధిలో పూత దశలో దమ్ము చేయాలి. పశువుల మేతకు ఇది ప్రయోజనం. నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం. చల్లుకుని కలియదున్నుకోవచ్చు.
రసాయన ఎరువులతో తగ్గుతున్న భూసారం
ప్రకృతి వ్యవసాయంతో సమస్యలకు చెక్
గుంటూరు జిల్లాకు 52 వేల కిట్లు
పంపిణీకి లక్ష్యం
నవధాన్యాల సాగుతో ప్రయోజనాలు ఇవే...
పొలంలో నవధాన్యాలను కలియదున్నితే భూసారం పెరుగుతుంది.
మొక్కలకు నత్రజని, సూపర్ ఫాస్పేట్ అదనంగా అందుతుంది.
జింకు, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులు పంటకు చేకూరుతాయి.
నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తాయి.
నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. వానపాముల ఉత్పత్తికి దోహదపడుతుంది.
నేల భౌతిక స్థితి మెరుగుపడి, భూమి గుల్లగా మారి నేలలోనికి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.
నేలలో సేంద్రీయ పదార్ధం వేయడంతో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేలలో సారం పెరగడమే కాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదకత సామర్ధ్యం పెరుగుతుంది.
నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లక్ష్య రూపంలోనికి మారుస్తాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు.
భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా పెరుగుతుంది.
నాణ్యమైన గింజలు ఉత్పత్తి అవుతాయి. దిగుబడి రెట్టింపు అవుతుంది.


