అటు మట్టి దందా..ఇటు ఆక్రమణలు
లాంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు
లాం(తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో ఓ వైపు మట్టి దందా, మరో వైపు స్థలాల వరుస ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ప్రశ్నించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువును చెరబట్టి రూ.కోట్ల విలువైన మట్టిని అమ్ముకొని జేబులు నింపుకొంటున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆక్రమణల పర్వానికి తెరలేపారు. కొండ పోరంబోకులో మట్టిని తోలి చదును చేసుకొంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణల పర్వం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
– లాం నుంచి జొన్నలగడ్డ వెళ్లే ప్రధాన రహదారిలో టీడీపీ నాయకులు కొండను మింగేసి మట్టిని తోలి పూడ్చివేసి ఆక్రమణల పర్వానికి తెరలేపారు. టీడీపీ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా జానెడు జాగాలో ఇళ్ళు నిర్మించుకొని నివసిస్తున్న పేదల ఇళ్లను 40కి పైగా పొక్లెయిన్లతో కూల్చారు. మరి కొంత మందికి నోటీసులిచ్చి, తమకు సహకరించాలని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. వీరి దుర్మార్గ వ్యవహారాలకు సహకరిస్తున్న అధికారులు సామాన్యులను మాత్రం వేధింపులకు గురిచేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణల పర్వానికి తెరదించాలని పలువురు కోరుతున్నారు.
అర్జీదారులకు అన్నదానం
ఏర్పాటుచేసిన జిల్లా ఆర్యవైశ్య సంఘం
నరసరావుపేట: జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లలో అర్జీలు, ఫిర్యాదులు అందజేసేందుకు జిల్లా నలుమూలల నుంచి అనేక సమస్యలతో వచ్చేవారికి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి శిఖాకొల్లి రాజేష్ (గుణ రాజేష్ ), చితిరాల అనిల్ కుమార్ సహకరించారు. కలెక్టర్ కార్యాలయంలో అన్నదానాన్ని జిల్లా జిల్లా ఫారెస్ట్ అధికారి జి.కృష్ణప్రియ ప్రారంభించగా, ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఆర్‌ఐ కృష్ణ ప్రారంభించి దాతలను సన్మానించారు. వారికి నిర్వహణ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు, తాడువాయి రామకృష్ణ, గౌరు శ్రీనివాసరావు, రెడ్డి మురళికృష్ణ, వనమా ప్రభాకర్ పాల్గొన్నారు.
అటు మట్టి దందా..ఇటు ఆక్రమణలు


