మలేరియా..వదలదయ్యా
గుంటూరు మెడికల్: మలేరియా ఈ పేరు చెబితేనే గ్రామాల్లో చాలా మంది ప్రజలు వణికిపోతారు. నెలల తరబడి జ్వరం పీడిస్తూ ఉండటమే కారణం. వ్యాధి సోకిదంటే ఒక పట్టాన త్వరగా శరీరాన్ని వదిలిపోదు. మలేరియా వ్యాధి సోకి అనేక మంది చనిపోతున్నారు. వ్యాధి బారిన పడకుండా మలేరియా పై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2007లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏప్రిల్ 25 వ తేదీని వరల్డ్ మలేరియా డే గా నిర్ధారించింది. 2007 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 25న దీనిని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
మలేరియా లక్షణాలు...
ఈ వ్యాధి అనాఫిలిస్ దోమకాటు వల్ల వస్తోంది. చలి,వణుకుతో కూడిన విపరీతమైన జ్వరం, ఒళ్ళునొప్పులు, మూత్రం మందగించటం, లివర్, కడుపులో నొప్పి, జ్వరం మూడు రోజులకొకసారి లేదా రెండు రోజులకొకసారి లేదా రోజు మార్చి రోజు వస్తూ ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయని పక్షంలో నెలల తరబడి వ్యాధి పీడిస్తోంది. కొందరిలో సెరిబ్రల్ మలేరియా, వైవ్యాక్స్ మలేరియాలు కూడా వస్తాయి. ఈ వ్యాధులు సోకిన వారిలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోవటం, కామెర్లు పెరిగిపోవటం, నిమోనియా, ఫిట్స్, మూత్రపిండాలు చెడిపోవటం, స్పృహకోల్పోవడం జరుగుతుంది. ఈ వ్యాధి మలేరియా ఉన్న వ్యక్తి రక్తం ఎక్కించటం ద్వారా, మలేరియా వ్యాధి ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ మనల్ని కుట్టటం ద్వారా సోకుతోంది.
నిర్ధారణ....
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. రక్తపు పూతలు సేకరించి వ్యాధి నిర్ధారణ జరిగితే క్లోరోక్విన్, ప్రై మాక్సిన్ అనే మాత్రలను ఇస్తారు. ఇవి 14 రోజులు ఆపకుండా తప్పని సరిగా వాడాలి. ఈ మందులన్నీ కూడా ఉచితంగానే అందిస్తారు. కొన్ని సందర్భాల్లో వైద్య సిబ్బంది ఇళ్ళకు వెళ్లి రక్తపు పూతలు సేకరిస్తారు. పూర్వం కేవలం ఐదు రోజుల మందులు వాడితే సరిపోయేది. కాని న్యూడ్రగ్ పాలసీ–2012 ప్రకారం తప్పని సరిగా 14 రోజులు వాడాలి.
దోమకాటు ద్వారా వ్యాధి వ్యాప్తి అవగాహనతో మలేరియా బారిన పడకుండా కాపాడుకోవచ్చు నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం
జిల్లాలో నమోదైన కేసులు
జిల్లా వ్యాప్తంగా 2021లో 2,06,359 మందికి రక్త పరీక్షలు చేయగా, 15 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ జరిగింది. 2022లో 2,27,905 రక్త నమూనాలు పరీక్షలు చేయగా 24 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయింది. 2023లో 3,82,551 మందికి రక్త పరీక్షలు చేయగా, 21 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయింది. 2024లో 3,52,748 మందికి రక్త పరీక్షలు చేయగా, వీరిలో పది మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయింది. 2025 మార్చి వరకు 1,08,880 మందికి రక్త పరీక్షలు చేయగా, ఒకరికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయింది. ఐదేళ్లలో జిల్లాలో మలేరియా మరణాలు ఒక్కటి కూడా సంభవించలేదు.
మలేరియా..వదలదయ్యా


