మహిళలను రాత్రి వేళ నిర్బంధించిన పోలీసులు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): పోలీసు యంత్రాంగం టీడీపీ నేతలకు దాసోహమై మహిళలపై వేధింపులకు దిగారు. సోమవారం రాత్రివేళ మహిళలను స్టేషన్‌కు పిలిపించిన పాత గుంటూరు పోలీసులు దాదాపు మూడు గంటల పాటు నిర్బంధించారు. వైన్ షాపు ఏర్పాటుపై నిరసన తెలిపినందుకు అక్రమ కేసు బనాయించి బెదిరింపులకు పాల్పడ్డారు. కొద్దిరోజులుగా గుంటూరు నందివెలుగు రోడ్డులో మణిహోటల్ సెంటర్ వద్ద లక్కీ వైన్స్ దుకాణ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. మసీదు, ఆలయం, దగ్గర్లోనే పాఠశాలలు కూడా ఉన్నందున నిరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 20న కూడా స్థానికులు నిరసన తెలియజేసి అడ్డుకున్నారు. దీనిపై బార్ నిర్వాహకుడు ఫిర్యాదు మేరకు పాత గుంటూరు పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి అడ్డుకున్నారంటూ స్థానికులపై కేసు నమోదు చేశారు. స్థానికులు బీరం సునీత, పద్మారెడ్డి, షేక్ సైదా, పవన్, గోిపీలతోపాటు, మరికొంత మందిపై వైన్ షాపును అడ్డుకున్నారంటూ అక్రమ కేసు బనాయించి సతాయిస్తున్నారు.
రాత్రి 7 గంటలకు పిలిచి 9.30 గంటల వరకు..
పోలీసులు అక్రమ కేసు బనాయించడమే కాకుండా ఆ మహిళలు స్టేషన్‌కు రావాలంటూ బెదిరింపులకు దిగారు. రాత్రి ఏడు గంటలకు వారిని పాత గుంటూరు స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు 9.30 గంటల వరకు కూర్చోబెట్టారు. వైన్ షాపును వ్యతికేరిస్తున్న అందరి పేర్లు చెప్పాలని బెదిరించారు. మరోవైపు వైన్ షాప్ నిర్వాహకులు తమపై దాడిచేశారంటూ స్థానికులు చేసిన ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదు. వైన్‌షాపునకు సంబంధించిన వ్యక్తులు వెంకట్, నాగరాజు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారని స్థానికులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్య చేపట్టలేదు.
వైన్ షాప్ వద్దని నిరసన తెలిపినందుకు అక్రమ కేసు
టీడీపీ నేతల అండదండలతో పోలీసుల ఓవర్ యాక్షన్


