
భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
– కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: భూ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌లో పలు రెవెన్యూ అంశాలపై నిర్వహించిన వర్క్‌షాపులో కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు, వెబ్ ల్యాండ్ టెక్నికల్ సమస్యలు, రీసర్వే తదితర అంశాల నుంచి అధిక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. సమస్యలకు కారణాలు పరిశీలించాలని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. వెబ్‌ల్యాండ్‌కు సంబంధించి సమస్యల పరిష్కారం జాయింట్ కలెక్టర్ లాగిన్‌లోనే చేయాల్సి ఉందన్నారు. కలెక్టర్ స్థాయిలోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావడం వల్ల జాప్యం అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని సమస్యల పరిష్కారానికి అర్జిదారులు పదేపదే వస్తున్నారని, దీన్ని అధికారులు గుర్తించాలన్నారు. సమస్య పరిష్కారం కాని వాటిని వారికి వివరించి చెప్పాలన్నారు. అధికంగా వస్తున్న సమస్యలపై రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ఒక వేళ భూ సమస్య పరిష్కారం కాకపోతే దానిని రికార్డు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.