పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న తెనాలి–బుర్రిపాలెం రోడ్డులో బాలిక సైకిల్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అటకాయించాడు. బాలికను ఎత్తుకుని పొలాల్లోకి తీసుకెళుతుండగా ఆమె కేకలు వేసింది. పరిసరాల్లో ఉన్న వారు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. రూరల్ ఎస్‌ఐ కె.ఆనంద్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని దుగ్గిరాలకు చెందిన బక్కెన రవిబాబుగా గుర్తించారు. తెనాలి రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అతన్ని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
బాలికపై లైంగిదాడి
తాడికొండ: బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోక్సో కేసు నమోదు చేసినట్లు తాడికొండ సీఐ వాసు తెలిపారు. వివరాల ప్రకారం తాడికొండకు చెందిన బాలిక ఈనెల 15న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసు తెలిపారు.
స్థలం వివాదంలో ముద్దాయిలకు జరిమానా, జైలు
అద్దంకిరూరల్: స్థల వివాదంలో ఆరుగురు ముద్దాయిలకు ఎఎస్‌జే కోర్టు జడ్జి జరిమానా, శిక్ష విధించినట్లు సీఐ సుబ్బరాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలు.. అద్దంకి మండలం మైలవరం గ్రామంలో 2020లో జరిగిన స్థల వివాదంలో అప్పటి ఎస్సై వీ.మహేష్ మన్నేపల్లి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ఫైల్ చేశారు. విచారణలో భాగంగా ముద్దాయిలైన ఉడుములపల్లి సోమయ్య, కొండనాగరాజు, కుడుములపల్లి పెదకోటయ్య, కుడుములపల్లి శ్రీనివాసరావు, కుడుములపల్లి కోటయ్య, కొండా చిరంజీవిలపై కేసు నిరూపణ కాగా గురువారం అద్దంకి ఎఎస్‌జే కోర్టు జడ్జి డీ. నాగ వెంకటలక్ష్మి ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.
చీరాలలో డ్రోన్‌లతో నిఘా
చీరాల: చీరాల పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు ఒన్‌టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు తెలిపారు. గురువారం రాత్రి పట్టణంలోని ప్రధాన ప్రాంతాలలో డ్రోన్‌ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. నిర్మానుష్య ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకునే దిశగా నిఘాను మరింత కఠినతరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారం ద్వారా చీరాలలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ నాగభూషణం, పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక నిఘా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్


