తాడేపల్లిరూరల్: ఎంటీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ విశ్వ విద్యాలయంలో విద్య నభ్యసిస్తున్న విద్యార్థులు రైఫిల్ షూటింగ్‌లో బంగారు, వెండి పతకాలను సాధించారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడల అసోసియేట్ డీన్ డాక్టర్ కె. హరికిషోర్ మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 30 వరకు చైన్నెలోని వెలచ్చేరి అన్నా గార్డెన్స్‌లో జరిగిన 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రైఫిల్ షూటింగ్ పోటీలలో తమ విశ్వవిద్యాలయంలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న తనీష్ మురళీధర్ బంగారు పతకం సాధించాడన్నారు. సీఎస్‌ఐటీ రెండవ సంవత్సరం చదువుతున్న నేలపల్లి ముఖేష్ వెండి పతకాన్ని సాధించాడన్నారు. మురళీధర్, ముఖేష్‌లను యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ, ప్రొ వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ హనుమంతరావు, క్రీడల అసోసియేట్ డీన్ డాక్టర్ కె.హరికిషోర్, వ్యాయామ అధ్యాపకులు అభినందించారు.
మేఘాలయపై బరోడా జట్టు విజయం
మంగళగిరి: నగర పరిధిలోని నవులూరు– అమరావతి టౌన్ షిప్ పరిధిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఉమెన్స్ అండర్–23 వన్‌డే ట్రోఫీలో బరోడా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మేఘాలయ జట్టు 36 ఓవర్లలో 38 పరుగులు చేసి ఆలౌటైంది. బరోడా జట్టు బౌలర్‌లు జె రాథోడ్, ఆర్య మెహతాలు చెరో మూడు వికెట్లు తీసి మేఘాలయ జట్టును కట్టడి చేశారు. అనంతరం 39 పరుగుల లక్ష్యంలో బ్యాటింగ్ చేపట్టిన బరోడా జట్టు 9.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 39 పరుగులు చేసి విజయం సాధించింది.


