
మాట్లాడుతున్న జేసీ శ్యాంప్రసాద్
జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్
సత్తెనపల్లి: గ్రామ పంచాయతీల పట్ల పంచాయతీ కార్యదర్శులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జేసీ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, నీటి నిల్వల తొలగింపు చేపట్టాలన్నారు. వీధి దీపాల నిర్వహణ, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. చెత్త సేకరణ, దాని ద్వారా ఎరువు తయారీపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎరువు తయారీ కార్యరూపం దాల్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమైన సమాచారం ప్రజలకు తెలియజేసేందుకు సరైన మాధ్యమాలు సకాలంలో ఉపయోగించుకోవాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్లు సర్వే నెంబర్, సబ్ డివిజన్ అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేరు లేని వారికి ఈ అప్లికేషన్లు పెట్టకూడదన్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేరు సవరణ, తండ్రి పేరు సవరణ, ఫోన్ నెంబర్ మార్పునకు మ్యూటేషన్ లేదా కరెక్షన్ అప్లికేషన్లు పెట్టించాలన్నారు. అనంతరం ఏపీ పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. సమావేశంలో ఎంపీడీఓ జీవీ సత్యనారాయణ, ఈఓపీఆర్‌డీ దయాసాగర్, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, తదితరులు ఉన్నారు.
నిరుద్యోగ యువతకు రుణాలు ఇప్పించాలి..
సత్తెనపల్లి: జిల్లాలో నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయించి వారికి రుణాలు కల్పించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. మంగళవారం సత్తనపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జేసీ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పెద్దపెద్ద ప్రాజెక్టుల ద్వారా రూ. 5 లక్షలు, రూ.10 లక్షలు, ఆ పైన వారికి రుణాలు కల్పించి తద్వారా యూనిట్‌లు ఏర్పాటు చేయిస్తే స్వతహాగా వారు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎంపీడీఓ జీవీ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.