
తెనాలి: రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక సాధికారత, సమన్యాయానికి తెనాలి నియోజకవర్గం అచ్చమైన నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. తెనాలి ఎంపీపీగా రజక సంఘీయుడైన ధర్మరాజుల చెన్నకేశవరావు ప్రమాణస్వీకారోత్సవం శుక్రవారం మధ్యాహ్నం అట్టహాసంగా జరిగింది. సభకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా మోపిదేవి మాట్లాడుతూ రాజకీయ చైతన్యానికి తెనాలి ప్రతీకని, ఉద్దండులకు జన్మనిచ్చిన ఈ గడ్డలో కొన్నిరోజులుగా బీసీ వర్గాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. ఎప్పుడూ అవకాశాలు రాని కులాలకు ప్రజాప్రతినిధులుగా, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా పదవీయోగం కల్పించారని, ఇందుకు కారకులైన ఎమ్మెల్యే శివకుమార్‌కు కృతజ్ఞతతో ఉండాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఇంతకాలం ఓటు బ్యాంకుగానే ఉన్నాయని, జెండాలు మోయటం, కొట్లాడుకోవటం, కేసులు పెట్టించుకోవటానికి మినహా వారికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. వీరంతా సగౌరవంగా తలెత్తుకు తిరిగేలా చేస్తానంటూ ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రూ.2.38 లక్షల కోట్ల సంక్షేమ లబ్ధిని చేకూర్చినట్టు గుర్తుచేశారు. వారిని మంత్రులు, ఎమ్మెల్సీలతో సహా అనేక పదవుల్లోకి తీసుకున్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో సామాజిక సాధికార బస్సు యాత్రలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు కల్పించిన గౌరవాన్ని బహుజనులు సగర్వంగా చెప్పుకుంటున్నారని మోపిదేవి చెప్పారు. అణగారిన వర్గాలకు ఎవరు మేలు చేస్తున్నదీ ఆత్మపరిశీలన చేసుకోవాల ని, 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే శివకుమార్‌కు అండగా నిలవాలని కోరారు. ఎవరెన్ని పొత్తులు, కలయికలు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటం ఖాయమన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా రజక సంఘీయుడికి తెనాలి ఎంపీపీ పదవిని కల్పించటం చారిత్రాత్మకమని అభివర్ణించారు. సమాజానికి సేవచేస్తున్న రజకులకు రాజకీయంగా ఎవరూ సహకరించలేదని చెబుతూ శివకుమార్ నాయకత్వంలో తెనాలి నుంచి చెన్నకేశవరావు ఎన్నిక గొప్పదిగా చెప్పారు. భవిష్యత్‌లో రజకులకు రాష్ట్రంలో మరిన్ని ఉన్నత పదవులు దక్కుతాయన్నారు.
ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రజలు కల్పించిన అవకాశంతో బడుగు బలహీనవర్గాలకు సామాజిక సమన్యాయాన్ని ఆచరణలో చూపగలుగుతున్నట్టు చెప్పారు. ఓసీ మహిళకు రిజర్వు అయిన మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని ముస్లిం మైనారిటీ సోదరికి కేటాయించి, రెండోపర్యాయం బీసీ యాదవ మహిళను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలోనే తొలిగా రజక వర్గీయుడైన ధర్మరాజుల చెన్నకేశవరావును తెనాలి ఎంపీపీ పదవికి ఎంపిక చేశామన్నారు. నియోజకవర్గంలో రూ.1,800 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రాష్ట్ర రజకసంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు మాట్లాడుతూ రజక వర్గానికి రాష్ట్రంలోనే తొలిగా ఎంపీపీ పదవి దక్కినట్టు చెప్పారు. రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రజకులకు కల్పించాల్సిన సౌకర్యాలను వివరించారు. ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవరావు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమర్థంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. పోతావఝుల పురుషోత్తమశర్మ స్వాగతం పలికిన సభలో రజక సంఘ రాష్ట్ర నాయకుడు నాగమల్లేశ్వరరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నేతలు మన్నవ ప్రభాకర్, గెడ్డేటి సురేంద్ర, ఓలేటి శివాజీ, అవుతు పోతిరెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, అవుతు నగేష్‌రెడ్డి, డాక్టర్ రియాజ్‌ఖాన్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, మద్దాళి శేషాచలం, ప్రసాదం బాలగురవమ్మ, కౌన్సిలర్లు పెదలంక లక్ష్మీలావణ్య, వీర్లపాటి విజయలక్ష్మి, గెడ్డేటి ఝాన్సీవాణి, వైకుంఠపురం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, అద్దంకి బోసుబాబు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తొలుత ధర్మరాజుల చెన్నకేశవరావు స్వగ్రామమైన సోమసుందరపాలెం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు
అట్టహాసంగా తెనాలి ఎంపీపీ
ధర్మరాజుల చెన్నకేశవరావు
పదవీ ప్రమాణ స్వీకారోత్సవం
రాష్ట్రంలోనే తొలిగా రజకులకు
తెనాలి ఎంపీపీ పదవి
చారిత్రాత్మకమని కీర్తించిన నేతలు