YSR Pension Kanuka: ఒక పోస్ట్‌మాస్టర్‌ పెన్షన్‌ కథ!

YSR Kadapa District: Postmaster get YSR Pension Kanuka - Sakshi

నాపేరు తబ్బిబ్బు మహానందప్ప. నా వయసు 84 సంవత్సరాలు. నేను ఉమ్మడి కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో జన్మించాను. ఆ కాలంలోనే అంటే 1961 లో పీయూసీ చదివి కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో 1961–63 సంవత్సరాలలో 3 సంవత్సరాల కాంపౌండర్‌ కోర్సు, 1965లో హిందీ ప్రవీణ ప్రచారక్‌ కోర్సులను పూర్తి చేశాను. ఆ తర్వాత  1970లో గ్రామంలోనే బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ ఉద్యోగం రావడంతో ఆ ఉద్యోగం చూసుకుంటూ స్వగ్రామంలోనే స్థిరపడ్డాను. పోస్ట్‌ మాస్టర్‌ ఉద్యోగం అదనపు శాఖా ఉద్యోగం (ఈడీ) కావడంతో జీతం చాలా తక్కువ వచ్చేది. 

ఉద్యోగం ప్రారంభంలో నా జీతం 30 రూపాయలు మాత్రమే. అలవెన్సు కింద మరో 15 రూపాయలు ఇచ్చేవారు. బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌గా 36 ఏళ్ళు పనిచేసి 2006 సంవత్సరంలో పదవీ విరమణ చేశాను. తపాలా శాఖ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనిదే అయినా బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌లకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి పెన్షన్‌ లేదు. పోస్ట్‌ మాస్టర్‌గా సుదీర్ఘ కాలం పని చేసినప్పటికీ కంటి తుడుపుగా గ్రాట్యుటీ పేరుతో కేవలం 48 వేల రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి సాగనంపారు. ఆ డబ్బులు కనీస అవసరాలను కూడా తీర్చలేక పోయాయి. అరకొర జీతంతోనే మా బ్రాంచ్‌ పోస్టాఫీసు పరిధిలోని తొమ్మిది గ్రామాలకు సేవలను అందించాను. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మా బ్రాంచ్‌ ఆదాయం నెలకు రెండువేల రూపాయలు ఉండేది. నేను రిటైర్‌ అయ్యే నాటికి ఆ ఆదాయం నెలకు 25 వేల రూపాయలకు పెరిగింది.

నా జీతం మాత్రం ‘గొర్రె తోక బెత్తెడు’ అన్న చందాన పదవీ విరమణ నాటికి 2,800 రూపాయలే. గ్రామీణ ప్రజలకు తపాలా సేవలను అందించడంతోపాటు కాంపౌండర్‌గా శిక్షణ పొంది ఉండటంవల్ల వైద్యసేవలు కూడా అందించాను. పదవీ విరమణ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం మాత్రమే కనబడింది. నా జీవన పోరాటంలో భాగంగా మైదుకూరులో నివాసం ఉంటూ ఈ వయసులో కూడా వైఎస్‌ఆర్‌ జిల్లా, దువ్వూరు మండలం, గుడిపాడులో ఒక ప్రైవేటు విద్యాసంస్థలో పార్ట్‌ టైం హిందీ బోధకుడిగా పనిచేస్తున్నాను. జగనన్న ప్రభుత్వం అందచేసే ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ కింద గత నెల దాకా 2,500 రూపాయలు అందించేవారు. తాజాగా ఈ మొత్తాన్ని మరో 250 రూపాయలు పెంచడం ఆనందదాయకం.

పెరిగిన మొత్తంతో కలిపి 2,750 రూపాయలు జనవరి 1వ తేదీ కానుకగా అందుకున్నాను. మా వార్డ్‌ వాలెంటీర్‌ ‘యాష్మిన్‌’ అనే అమ్మాయి ప్రతి నెలా ఒకటో తేదీనే మా ఇంటి కొచ్చి ఠంచనుగా పింఛన్‌ అందచేస్తోంది. ఈ పింఛనే నా ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. (క్లిక్ చేయండి: అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం)

– టి. మహానందప్ప, రిటైర్డ్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్, మైదుకూరు

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top