అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం

What do we Know About Infant Mortality in the United States of America - Sakshi

అమెరికా అనగానే మనలో చాలామంది పులకించిపోతారు. అది అకారణమైనా సకారణమైనా అగ్ర రాజ్యాన్ని బలంగా నమ్ముతారు. అందుకు కొన్ని సత్యాలు, కొన్ని అర్ధసత్యాలు, మరిన్ని అసత్యాలు కారణం కావచ్చు. అలాంటి దేశాన్ని ‘అనారోగ్య దేశం’ అనటం నమ్మశక్యం కాదు. అంతగా దాని ప్రతిష్ఠ నెలకొని ఉంది. అయితే అక్కడ కొన్ని అంశాల్లో ప్రగతి తక్కువేమీ కాదు. వాటిలో జీవన ప్రమాణాలు పెరగడం, ఎక్కువ మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం, పొగత్రాగడం తగ్గటం, వివాహపూర్వ గర్భిణీలు తగ్గడం, జాతుల మధ్య వివక్ష అంతరాలు తగ్గడం లాంటివి ముఖ్యమైనవి.

వీటిని పరిశీలించినప్పుడు సాధారణంగా ఆశావహ అంచనాతో అమెరికా అన్ని విధాలా ఆరోగ్యకరమైన దిశగా పయనిస్తోంది అనుకుంటాము. కానీ గత రెండు దశాబ్దాల పరిణామాలను నిశితంగా గమనిస్తే వీటిలో వాస్తవం ఉన్నట్లు కనిపించదు. కోవిడ్‌–19 నేపథ్యంలో బయటపడిన అమెరికా డొల్లతనం, ఇటీవలి ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ లోని గణాంక వివరాలు ఇందుకు తార్కాణం.

అమెరికాలో శిశుమరణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. 2019లో కోవిడ్‌–19 ముందు ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో– ఆపరేషన్‌ అండ్‌  డెవలప్మెంట్‌ (ఓఈసీడీ) దేశాల్లో అమెరికా స్థానం చాలా దేశాల కన్నా ఈ విషయంలో అథమ స్థితిలో ఉంది. అమెరికన్ల జీవన ప్రమాణం జర్మనీ కన్నా 2.5 ఏళ్లు, కెనడా కన్నా 3.2 ఏళ్లు, ఫ్రాన్స్‌ కన్నా నాలుగు సంవత్సరాలు తక్కువగా ఉంది. యూరో పియన్‌ యూనియన్, ఆసియాకు చెందిన ఓఈసీడీ దేశాల్లోకన్నా తక్కువగా... 33వ స్థానంలో ఉంది. 

కోవిడ్‌ మృత్యుహేల అమెరికాలోని పరిస్థితులను మరింత దిగజార్చింది. కోవిడ్‌ మరణాలు అన్ని సంపన్న దేశాల్లో కన్నా అక్కడ ఎక్కువగా నమోద య్యాయి. అమెరికాలో ప్రతి లక్ష మందికి  332 మరణాలు సంభవించగా ఫ్రాన్స్‌లో ఇవి 240, జర్మనీలో 194, కెనడాలో 128. అలాగే అమెరికాలో జీవన ప్రమాణం 2021లో 76.4కి పడిపోయింది. ఇది 1996 తర్వాత అతి తక్కువ. దీనితో అక్కడ ఓ పాతిక సంవత్సరాల ప్రగతి తుడిచిపెట్టుకు పోయినట్లయింది. ఇదే సమయంలో అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుదల మరో రకపు ప్రతికూలత సూచిస్తోంది.

అక్కడి పౌర సమాజంలో అధిక సంఖ్యాకులలో గల ఊబకాయం అనేక రకాల రుగ్మతలకు కారణంగా పరిగణిస్తున్నారు. జీవన ప్రమాణాలు ఉండవలసిన స్థాయిలో ఉండకపోవడానికి ఇదొక కారణంగా పేర్కొంటున్నారు. 2000 నుండి 2020 సంవత్సరం వరకూ ఊబకాయులు 30.5 శాతం నుండి 41.9 శాతానికి పెరిగారు. ఊబకాయం అనేక వ్యాధులకు కారకం. వాటిలో ముఖ్యమైనది చక్కెర వ్యాధి. 

మొత్తంగా అమెరికాలోని ఈ పరిస్థితులను గమనించినప్పుడు... అక్కడి గొప్పదైన సంపద, వైద్య సాంకేతికత, అత్యంత ఎక్కువ ఆరోగ్య సంరక్షణ తలసరి వ్యయం, ప్రజారోగ్య వ్యవస్థ వంటి సమస్తం సంక్షోభంలో ఉండి అత్యంత పేలవంగా పనితీరు కనపరుస్తూ ఉన్నట్లు స్పష్టమౌతుంది. మెరిసేదంతా బంగారం కాదనే నానుడిని అమెరికా ప్రస్తుత పరిస్థితి నిరూపిస్తోంది. (క్లిక్ చేయండి: జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?)

– బి. లలితానంద ప్రసాద్, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ 

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top