quality of life
-
ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం
భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యోగ వలసల ధోరణిలో ఒక ఊహికందని, సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంటోంది. నిన్నటివరకు మెట్రో నగరాల్లోని భారీ ప్యాకేజీలు, ఆకాశాన్ని తాకే జీతాల కోసం పరుగులు తీసిన యువ ఐటీ, కార్పొరేట్ నిపుణులు.. ఇప్పుడు రూట్ మార్చుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, అధిక జీవన వ్యయంతో విసిగిపోయిన యువత.. భారీ జీతాల కంటే ప్రశాంతమైన జీవితానికే (క్వాలిటీ ఆఫ్ లైఫ్) ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘అడెక్కో ఇండియా’ నిర్వహించిన ‘ఎక్స్టర్నల్ డిస్రప్షన్స్ అండ్ వర్క్‌ఫోర్స్ ప్రొడక్టివిటీ రిపోర్ట్ 2026’ నివేదికలో వెల్లడైన ఈ నిజాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.జీతాల కంటే ప్రశాంతతకే ఓటుభారతదేశంలో ప్రతిష్టాత్మక కంపెనీలకు, మెరుగైన కెరీర్ ఎదుగుదలకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చాయి. అయితే ‘అడెక్కో ఇండియా 2026’ నివేదిక ప్రకారం, 35 ఏళ్లలోపు వయసున్న యువ నిపుణులలో దాదాపు 50 నుంచి 55 శాతం మంది మెట్రో నగరాల్లోని భారీ జీతాల కంటే సొంత ఊర్లకు దగ్గరగా ఉండటం, ప్రశాంతమైన జీవన ప్రమాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, భారతదేశ ప్రతిభావంతులైన శ్రామిక శక్తి (టాప్ టాలెంట్) ఇప్పుడు మెట్రోల సరిహద్దులు దాటి చిన్న నగరాల వైపు వేగంగా విస్తరిస్తోంది.చిన్న నగరాల్లో భారీగా పెరుగుతున్న ఉద్యోగాలుఈ మార్పు తాత్కాలికమైనది కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మల్ హైరింగ్ (ఉద్యోగ నియామకాల) వృద్ధిలో ఏకంగా 70 శాతం చిన్న నగరాల (నాన్-మెట్రోస్) నుంచే వస్తుండగా, మెట్రో నగరాల వాటా కేవలం 30 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలోని రిమోట్ ఉద్యోగులలో 30-35 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాల నుంచే పని చేస్తున్నారు. ముఖ్యంగా కోయంబత్తూర్, ఇండోర్, సూరత్, వడోదర, లక్నో వంటి నగరాలు నైపుణ్యం కలిగిన నిపుణులను, సరికొత్త ఉద్యోగ అవకాశాలను భారీగా ఆకర్షిస్తూ కొత్త హబ్‌లుగా అవతరిస్తున్నాయి.రంగాలవారీగా రిమోట్ ఉద్యోగాల జోరుయువత మానసిక స్థితిని అర్థం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. దాదాపు 40 శాతం సంస్థలు ఇప్పటికే ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌ను అమలు చేస్తూ, ప్రధాన నగరాల్లో పెద్ద ఆఫీసులతో పాటు చిన్న పట్టణాలలో శాటిలైట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. రంగాలవారీగా చూస్తే, టెక్నాలజీ (ఐటీ) రంగంలో రిమోట్, హైబ్రిడ్ నియామకాలు ఏడాది ప్రాతిపదికన 30 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 20-25 శాతం, హెల్త్‌కేర్ రంగంలో 15-20శాతం, అలాగే ఈ-కామర్స్ అండ్ రిటైల్ రంగంలో 15-18 శాతం మేర హైబ్రిడ్ ఉద్యోగాలు వృద్ధి చెందాయి.వివిధ ప్రాంతాలకు శ్రామికశక్తి విస్తరణనగరాల్లో నిరంతరం తలెత్తుతున్న మౌలిక వసతుల లోపాలు, ప్రకృతి విపత్తులు ఈ వలసలను మరింత వేగవంతం చేస్తున్నాయి. దేశంలోని 97 శాతం మంది యజమానులు వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాల ఒత్తిడి, ప్రజారోగ్య సమస్యల వంటి బాహ్య అడ్డంకులను నిరంతరం ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది. కేవలం ఒకే నగరంలో కేంద్రీకృతమవ్వడం వల్ల వరదలు, రవాణా వ్యవస్థల స్తంభన వంటి సమయాల్లో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అందుకే సుమారు 95 శాతం కంపెనీలు తమ వ్యాపార కొనసాగింపు కోసం శ్రామిక శక్తిని వివిధ ప్రాంతాలకు విస్తరించడాన్ని (డిస్ట్రిబ్యూటెడ్ వర్క్‌ఫోర్స్) ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయి.హైదరాబాద్, బెంగళూరులో..నగరాల్లో పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి కారణంగా ఉద్యోగుల మానసిక స్థితి, ఉత్సాహం, ఉత్పాదకత దారుణంగా దెబ్బతింటున్నాయి. ఈ నివేదిక ప్రకారం, 42శాతం కంపెనీలు తమ ఉద్యోగులలో ఉత్సాహం తగ్గిందని, 40శాతం కంపెనీలు అబ్సెంటీయిజం (ఆఫీసులకు రాకపోవడం) పెరిగిందని తెలిపాయి. ఐటీ హబ్ బెంగళూరులో అత్యధికంగా 48శాతం మంది యజమానులు తమ ఉద్యోగుల మోరల్ పడిపోయినట్లు పేర్కొనగా, హైదరాబాద్ 44 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే, కాలుష్యం, వాతావరణ విపత్తుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అత్యధికంగా 44 శాతం కంపెనీలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.భవిష్యత్ వ్యూహాలు, సవాళ్లుఈ సరికొత్త పరిణామాలపై అడెక్కో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చేమంకోటిల్ స్పందిస్తూ, ‘భారతదేశంలోని యజమానులు కేవలం విపత్తులను నిర్వహించడం లేదు, ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన వర్క్‌ఫోర్స్ మార్కెట్లో రీసైలెన్స్ (స్థిరత్వం) ను తిరిగి నిర్వచిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత విపత్తు నివారణ చర్యలలో కంపెనీలు తమ సామర్థ్యానికి 10 పాయింట్లకు గానూ కేవలం 5 పాయింట్లు మాత్రమే ఇచ్చుకోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో మెట్రో నగరాల ఆర్థిక ప్రాముఖ్యత తగ్గకపోయినప్పటికీ, భారతదేశ ప్రతిభావంతుల భవిష్యత్తు మాత్రం చిన్న నగరాల వైపే నడవబోతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీలపై కుక్కలను ఉసిగొల్పి.. -
బెంగళూరు కంటే హైదరాబాదే బెస్ట్!
నేటి కార్పొరేట్ ప్రపంచంలో లక్షల ప్యాకేజీలు, ఆకర్షణీయమైన కెరీర్ వృద్ధి వైపే యువత పరుగులు తీస్తోంది. కానీ, ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ సరికొత్త చర్చకు తెరలేపింది. ‘బెంగళూరులో రూ.38 లక్షల ప్యాకేజీ (ఎల్పీఏ) కావాలా? లేక హైదరాబాద్‌లో ప్రశాంత జీవితం కావాలా?’ అంటూ సదరు ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఆన్లైన్ వేదికగా వైరల్‌గా మారింది.ఆ వేతనం కంటే.. జీవన నాణ్యతే ముఖ్యం!మధన్ మోహన్ అనే ఓ ఐటీ నిపుణుడు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన కెరీర్ ఎంపిక గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు. ప్రస్తుత సంస్థలో చేరడానికి ముందు తన వద్ద రెండు బెటర్ జాబ్ ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించాడు. ఆఫర్ 1.. రూ.38 ఎల్పీఏ ప్యాకేజీ, బెంగళూరులో లొకేషన్. ఆఫర్ 2.. రూ.30 లక్షల ప్యాకేజీ, హైదరాబాద్‌లో జాబ్ లొకేషన్. ‘నా చుట్టూ ఉన్న చాలా మంది.. చేతికి వచ్చే ఆ 8 లక్షల రూపాయల అదనపు ఆదాయాన్ని ఎందుకు వదులుకుంటావు? అని ప్రశ్నించారు. కానీ కొన్నిసార్లు, ఉత్తమ నిర్ణయం అంటే కేవలం అత్యధిక ప్యాకేజీని ఎంచుకోవడం మాత్రమే కాదని నేను గ్రహించాను’ అని మధన్ మోహన్ పేర్కొన్నాడు.హైదరాబాద్‌పైనే ఎందుకు మొగ్గు?‘బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో నిత్యావసరాలు, జీవన వ్యయం చాలా తక్కువ. ట్రాఫిక్, రోజువారీ ఉరుకుల పరుగుల ఒత్తిడి కూడా తక్కువే. దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యులు సమీపంలోనే ఉన్నారు. హైదరాబాద్ బెస్ట్ ఫుడ్, ఇక్కడి అనుకూల వాతావరణం మానసిక ప్రశాంతతను ఇస్తాయి. చాలా మంది ఉద్యోగులు కేవలం కాగితంపై కనిపించే సీటీసీని మాత్రమే లెక్కిస్తారు. కానీ జీవితంలో ఆనందం, మానసిక శ్రేయస్సు, జీవన నాణ్యతను లెక్కించడం మర్చిపోతారు. దీర్ఘకాలంలో మనశ్శాంతే అత్యంత విలువైనది. ఒత్తిడికి బదులు శాంతిని ఎంచుకోవడం కూడా ఒక తెలివైన కెరీర్ ప్లానింగే’ అని అతను నెటిజన్లతో పంచుకున్నాడు. తన నిర్ణయం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ప్రస్తుతం సంతృప్తితో ఉన్నానని తెలిపాడు.నెట్టింట స్పందనలు ఇలా..మధన్ మోహన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దాదాపు 82,000 కంటే ఎక్కువ వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ‘జీతం వర్సెస్ జీవన నాణ్యత’ అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘అన్ని నగరాల కంటే హైదరాబాదే బెస్ట్’ అని కొందరు వ్యాఖ్యానించగా.. ‘నాకు కూడా హైదరాబాద్ సొంత ఇల్లాంటి అనుభూతినే ఇస్తుంది’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో ఖర్చులు చాలా తక్కువ సోదరా, నీ నిర్ణయం కరెక్ట్’ అంటూ మెజారిటీ నెటిజన్లు తన నిర్ణయాన్ని కొనియాడారు. ‘నేనైతే బెంగళూరులో ఆ రూ.38 లక్షల ఆఫర్ తీసుకునేవాడిని. అక్కడ ఏడాది పాటు పనిచేసి ఆపై 30% హైక్‌తో రూ.50 లక్షల ప్యాకేజీకి హైదరాబాద్‌లో ఉద్యోగం వెతుక్కుని వచ్చేవాడిని. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి మార్పులు ఆర్థికంగా భారీ ఊతాన్ని ఇస్తాయి. అయితే, ఇవి తరచూ చేయడం సరైందికాదు’ అని ఒకరు స్పందించారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం
అమెరికా అనగానే మనలో చాలామంది పులకించిపోతారు. అది అకారణమైనా సకారణమైనా అగ్ర రాజ్యాన్ని బలంగా నమ్ముతారు. అందుకు కొన్ని సత్యాలు, కొన్ని అర్ధసత్యాలు, మరిన్ని అసత్యాలు కారణం కావచ్చు. అలాంటి దేశాన్ని ‘అనారోగ్య దేశం’ అనటం నమ్మశక్యం కాదు. అంతగా దాని ప్రతిష్ఠ నెలకొని ఉంది. అయితే అక్కడ కొన్ని అంశాల్లో ప్రగతి తక్కువేమీ కాదు. వాటిలో జీవన ప్రమాణాలు పెరగడం, ఎక్కువ మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం, పొగత్రాగడం తగ్గటం, వివాహపూర్వ గర్భిణీలు తగ్గడం, జాతుల మధ్య వివక్ష అంతరాలు తగ్గడం లాంటివి ముఖ్యమైనవి. వీటిని పరిశీలించినప్పుడు సాధారణంగా ఆశావహ అంచనాతో అమెరికా అన్ని విధాలా ఆరోగ్యకరమైన దిశగా పయనిస్తోంది అనుకుంటాము. కానీ గత రెండు దశాబ్దాల పరిణామాలను నిశితంగా గమనిస్తే వీటిలో వాస్తవం ఉన్నట్లు కనిపించదు. కోవిడ్–19 నేపథ్యంలో బయటపడిన అమెరికా డొల్లతనం, ఇటీవలి ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ లోని గణాంక వివరాలు ఇందుకు తార్కాణం. అమెరికాలో శిశుమరణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. 2019లో కోవిడ్–19 ముందు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో– ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) దేశాల్లో అమెరికా స్థానం చాలా దేశాల కన్నా ఈ విషయంలో అథమ స్థితిలో ఉంది. అమెరికన్ల జీవన ప్రమాణం జర్మనీ కన్నా 2.5 ఏళ్లు, కెనడా కన్నా 3.2 ఏళ్లు, ఫ్రాన్స్ కన్నా నాలుగు సంవత్సరాలు తక్కువగా ఉంది. యూరో పియన్ యూనియన్, ఆసియాకు చెందిన ఓఈసీడీ దేశాల్లోకన్నా తక్కువగా... 33వ స్థానంలో ఉంది. కోవిడ్ మృత్యుహేల అమెరికాలోని పరిస్థితులను మరింత దిగజార్చింది. కోవిడ్ మరణాలు అన్ని సంపన్న దేశాల్లో కన్నా అక్కడ ఎక్కువగా నమోద య్యాయి. అమెరికాలో ప్రతి లక్ష మందికి 332 మరణాలు సంభవించగా ఫ్రాన్స్‌లో ఇవి 240, జర్మనీలో 194, కెనడాలో 128. అలాగే అమెరికాలో జీవన ప్రమాణం 2021లో 76.4కి పడిపోయింది. ఇది 1996 తర్వాత అతి తక్కువ. దీనితో అక్కడ ఓ పాతిక సంవత్సరాల ప్రగతి తుడిచిపెట్టుకు పోయినట్లయింది. ఇదే సమయంలో అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుదల మరో రకపు ప్రతికూలత సూచిస్తోంది. అక్కడి పౌర సమాజంలో అధిక సంఖ్యాకులలో గల ఊబకాయం అనేక రకాల రుగ్మతలకు కారణంగా పరిగణిస్తున్నారు. జీవన ప్రమాణాలు ఉండవలసిన స్థాయిలో ఉండకపోవడానికి ఇదొక కారణంగా పేర్కొంటున్నారు. 2000 నుండి 2020 సంవత్సరం వరకూ ఊబకాయులు 30.5 శాతం నుండి 41.9 శాతానికి పెరిగారు. ఊబకాయం అనేక వ్యాధులకు కారకం. వాటిలో ముఖ్యమైనది చక్కెర వ్యాధి. మొత్తంగా అమెరికాలోని ఈ పరిస్థితులను గమనించినప్పుడు... అక్కడి గొప్పదైన సంపద, వైద్య సాంకేతికత, అత్యంత ఎక్కువ ఆరోగ్య సంరక్షణ తలసరి వ్యయం, ప్రజారోగ్య వ్యవస్థ వంటి సమస్తం సంక్షోభంలో ఉండి అత్యంత పేలవంగా పనితీరు కనపరుస్తూ ఉన్నట్లు స్పష్టమౌతుంది. మెరిసేదంతా బంగారం కాదనే నానుడిని అమెరికా ప్రస్తుత పరిస్థితి నిరూపిస్తోంది. (క్లిక్ చేయండి: జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?) – బి. లలితానంద ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ -
ప్రపంచంలో ఉత్తమ, చెత్త నగరాలివే
లండన్: అత్యున్నత జీవన ప్రమణాలు కలిగివున్న నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొదటిస్థానంలో నిలిచింది. ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ మెర్సర్.. ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో అభిప్రాయసేకరణ నిర్వహించి వెల్లడించిన జాబితాలో వియన్నా వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో అత్యంత చెత్తనగరంగా బాగ్దాద్ చివరిస్థానంలో నిలిచింది. రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రైమ్, వినోదం మరియు రవాణా ప్రమాణాలు లాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మెర్సర్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో లండన్, పారిస్, టోక్యో, న్యూయార్క్ నగరాలు టాప్ 30లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. వియన్నాతో పాటు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వాంకోవర్లు వరుసగా టాప్ 5లో నిలిచాయి. ఆసియా నుంచి అగ్రస్థానంలో సింగపూర్(25వ ర్యాంకు) నిలిచింది. అమెరికా నుంచి ఈ జాబితాలో టాప్‌లో నిలిచిన నగరం శాన్ఫ్రాన్సిస్కో(29వ ర్యాంకు). -
జీవితానికి రన్‌వే...
వంద మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది... ఇదే నానుడితో నడక మొదలు పెట్టారీ మహిళలు. ఆ నడకను కాస్తా పరుగుగా మార్చి, సుదీర్ఘమైన పరుగుతో జీవితంలో కొత్త లక్ష్యాలు చూస్తున్నారు. క్వాలిటీ లైఫ్ కోసం ఒకరు ... జీవితంలో నిలబడడానికి ఒకరు... రికార్డు మారథాన్ల కోసం ఒకరు... ఇలా పరుగునే జీవితంగా మార్చుకున్నారు. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ఇవాళ మారథాన్ నిర్వహిస్తున్న వేళ విభిన్నమైన జీవితాల నుంచి వచ్చిన ముగ్గురు మహిళల పరుగు ప్రయాణం గురించి... అస్సాంకు చెందిన కస్తూరికి పరుగు కేవలం హాబీ. పుణే నుంచి వచ్చిన అపర్ణది జీవన్మరణ పోరాటం. హైదరాబాద్‌వాసి యాభెరైండేళ్ల పద్మది అధిక బరువు తగ్గాలనే చిన్న కోరిక. అక్కడి కోచ్ సలహాతో రన్‌ను ఓ సాహసంలా మొదలు పెట్టారు. రెండేళ్లు తిరక్కుండానే ఆమె ఇండియా, ఇండోనేషియాల్లో 12 హాఫ్ మారథాన్లను పూర్తి చేశారు. ఇప్పుడామె లక్ష్యం పరుగెడుతూ ఉండడమే. సునీతకు కొత్త ప్రదేశాలను చూడడం, ఫొటోగ్రఫీ ఇష్టం. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, సామాజికంగా చైతన్యం తీసుకురావడం ఆమె అభిలాష. స్నేహితులతో హిమాలయాల్లో చేసిన ట్రెక్కింగ్ ఆమెను మారథాన్ వైపు మళ్లించింది. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న సామాజిక పరుగు ఉద్యమంలో పాల్గొనే వారిలో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. ఆరేళ్ళక్రితం ముప్ఫై తొమ్మిదేళ్ళ వయసులో పరుగు ప్రారంభించిన సునీతకు ఇప్పుడు 45 ఏళ్లు. ఈ ఆరేళ్లలో 30 ఫుల్ మారథాన్లు, పది హాఫ్ మారథాన్లు చేశారు. వీటితోపాటు బెంగళూరులో 50 కి.మీ రేస్, న్యూజిలాండ్‌లో 100 కి.మీ రేస్‌లోనూ పాల్గొన్నారు. భారత్ నుంచి పాల్గొన్న ఏకైక మహిళ ఆమె. ఈ పరుగు ఎవరెస్టుకి తొలిమెట్టు! ఈ ఏడాది హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహిస్తున్న మారథాన్ నాలుగోది. ఈ రన్లో పాల్గొనడం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు అవుతుందంటారు పుణే నుంచి వచ్చిన అపర్ణ. ఆమెకు 44 ఏళ్ళు. ఎముకలను తినేసే వ్యాధితో బాధపడిన ఆమె ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడాలనే తపనతోనే పరుగును ఓ యజ్ఞంలా చేస్తున్నారు. వీల్ చెయిర్‌కే పరిమితం కావాల్సిన జీవితాన్ని ఆమె పట్టుదలతో ట్రాక్‌లోకి తెచ్చుకున్నారు. గత ఏడాది మే నెల నుంచి మారథాన్లలో ఆమె పాల్గొంటున్నారు. ఆమెకిది నాలుగో మారథాన్. ‘‘ఇప్పటి వరకు అన్నీ హాఫ్ మారథాన్‌లే. వచ్చే ఏడాది జనవరిలో ముంబయిలో ఫుల్ మారథాన్‌లో పాల్గొంటాను. నా లక్ష్యం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం. హైదరాబాద్‌లో నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈ నేల మీద పరిగెట్టిన అనుభవం హిమాలయాల అధిరోహణకు దోహదం చేస్తుందనే ఇక్కడికి వచ్చాను’’ అన్నారామె. ఈ పరుగు తన ఆరోగ్యాన్ని కాపాడడమే కాక మానసిక స్థయిర్యాన్ని పెంచింది, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నారు. హాఫ్ మారథాన్‌ను రెండు గంటల పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె... ఈ నేల మీద ఎంత సమయం పడుతుందో చూడాలంటున్నారు. నిజానికి ఆమె హాఫ్ మారథాన్ పూర్తి చేసిన సమయం సాధారణమైన వ్యక్తులు తీసుకునే సమయం కంటే తక్కువే. ఆమె ఇద్దరు కూతుళ్లు, కొడుకు తల్లిని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఇంతకంటే కావల్సింది ఏముంది- అంటారామె. మారిన జీవన శైలి! ఇప్పటికి 12 హాఫ్ మారథాన్లు పూర్తి చేసిన పద్మ రెండు నెలల్లో 15 కిలోలు తగ్గారు. అప్పట్లో నాలుగ్గంటల నిద్రపోవడమే కష్టమయ్యేది, ఇప్పుడు ఏడు గంటల పాటు చక్కగా నిద్రపోగలుగుతున్నానంటారామె. అందరూ బృందంగా పరుగు పెట్టడం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయంటారామె. ఆమె ఈ పరుగులో పాల్గొనడానికి రిలయెన్స్‌లో పని చేసే తన ఉద్యోగులను చైతన్యవంతం చేశారు. ‘‘నేను పొందిన ప్రయోజనాలు నా సహోద్యోగులు కూడా పొందాలనేదే నా తాపత్రయం. మారథాన్ రన్ ప్రారంభించిన తర్వాత దేహం దానంతట అదే ఆహారపు అలవాట్లను మార్చుకుంది. ఇప్పుడు నూనెపదార్థాలను చూసినా తినాలపించడం లేదు. పండ్లు తినాలనే కోరిక పెరుగుతోంది. నీళ్లు తాగాలనే కోరిక కూడా ఎక్కువైంది. దేహమే అలా కోరుకుంటోంది. అంతకంటే పెద్ద విషయం మానసిక సమతుల్యత బాగా ఎక్కువైంది’’ అంటారామె. అలాంటి వారిలో వైశాలి, సయూరి దల్వీ లాంటి ఎందరో ఉన్నారు. ఐఐటి ప్రొఫెసర్ల నుంచి బ్యాంకింగ్ ఉన్నతోద్యోగుల వరకు వివిధ రంగాల వాళ్లు, ముఖ్యంగా మహిళలు మారథాన్‌లో పాల్గొంటున్నారు. ఇంతటి సుదీర్ఘమైన పరుగులో పాల్గొంటున్న ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన కారణం ఉన్నప్పటికీ అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట మాత్రం... ‘పరుగుతో దేహం, మెదడు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఎంతటి ఒత్తిడులనైనా తట్టుకుని వాటిని సమగ్రంగా నిర్వర్తించగలిగిన మనోనిశ్చలత్వం వచ్చింది. చీకాకులు దరి చేరడం లేదు. మనసు ఆహ్లాదంగా ఉంటోంది’ అని మాత్రమే. నిజమే! పరుగెత్తితే... పాలు తాగకపోయినా దేహం కోరినన్ని నీళ్లు తాగవచ్చు. అదే గొప్ప ఆరోగ్యం, ఆనందం. - వాకా మంజులారెడ్డి


