Telangana Government Priority To Medical Sector And Public Health - Sakshi
Sakshi News home page

Telangana: ఇక ప్రజారోగ్యానికి మహర్దశ

Published Thu, May 12 2022 12:45 PM

Telangana Government Priority to Medical Sector And Public Health - Sakshi

దశాబ్దాలుగా సర్కారు వైద్యంపై పాలకులు చూపిన అంతులేని నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కోల్పోయి, ప్రైవేటు వైద్యం వైపు మళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి విశేష ప్రాధాన్యం ఇస్తూ పేదలకు సర్కారు వైద్యం పట్ల మళ్లీ నమ్మకాన్ని కలిగిస్తోంది. పేదలకు ఉచితంగా నాణ్యమైన, ఆధునిక వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆలోచనలు ఆచరణలోకి వస్తున్నాయి. ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అమలుచేస్తూ పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందిస్తూనే... మరోవైపు ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక అడుగులు వేస్తున్నారు. 

హైదరాబాద్‌ నలు మూలలా నాలుగు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌), వరంగల్‌లో హెల్త్‌ సిటీ, 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు వంటి చారిత్రక నిర్ణయాలతో ప్రభుత్వ వైద్య వ్యవస్థకు జీవం పోస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో యుద్ధప్రాతిపాదికన గచ్చిబౌలిలో ఖాళీగా ఉన్న భవనాలను వినియోగించుకొని 1,500 పడకలతో మొదటి టిమ్స్‌ ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వేలాదిమంది కరోనా రోగులకు ఈ ఆసుపత్రి వైద్యాన్ని అందించి జీవం పోసింది. ఇదే స్ఫూర్తితో నగరానికి మిగతా మూడు వైపులా కూడా టిమ్స్‌లు నిర్మించాలనే బృహత్తర ఆలోచనను ముఖ్య మంత్రి కేసీఆర్‌ చేశారు. 

ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 26వ తేదీన రూ. 2,679 కోట్లతో సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లో ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ (టిమ్స్‌) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సనత్‌నగర్‌ పరిధిలోని ఎర్రగడ్డ చెస్ట్‌ హాస్పిటల్‌ ప్రాంగణంలో, ఎల్బీ నగర్‌లోని గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ ప్రాంగణంలో, అల్వాల్‌లోని బొల్లారంలో టిమ్స్‌లు నిర్మాణం అవుతున్నాయి. ప్రతీ ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 300 పడకలు ఐసీయూలో ఉంటాయి. అన్ని పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం ఉంటుంది. ఒక్కో టిమ్స్‌ 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది. మొత్తం 30 విభాగాల్లో 200 మంది టీచింగ్‌ డాక్టర్లు, 500 మంది రెసిడెంట్‌ డాక్టర్లు సేవలు అందిస్తారు. ప్రతి టిమ్స్‌లో 16 ఆపరేషన్‌ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ టిమ్స్‌ నిర్మాణం పూర్తి అయితే ప్రస్తుతం ఉన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఆసుపత్రులపైన ఒత్తిడి తగ్గుతుంది. ఆయా ఆసుపత్రు ల్లోనూ వైద్య సేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు నమ్మకం కలిగించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. బస్తీల్లో బస్తీ దవాఖానాలు అద్భుతంగా సేవలు అందిస్తున్నాయి. పల్లెల్లో పల్లె దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించింది. గతంలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు దశాబ్దాల కోరికగా ఉండేది. మెడికల్‌ కాలేజీల కోసం ఉద్యమాలు జరిగేవి. కానీ, ఇప్పుడు 33 జిల్లాల్లో 33 మెడికల్‌ కాలేజీల ఏర్పాటు కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. (చదవండి: భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?)

ఇక వరంగల్‌లో రూ.1,100 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న హెల్త్‌ సిటీ కూడా ప్రభుత్వ వైద్య వ్యవస్థలో గొప్పగా నిలవబోతోంది. అలాగే ఇప్పటికే ఉన్న ఎంజీఎంతో పాటు కాకతీయ మెడికల్‌ కాలేజీని కలిపి వరంగల్‌ హెల్త్‌ సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల ప్రజలు వైద్యం కోసం వరంగల్‌కు వస్తుంటారు. అందువల్ల హెల్త్‌ సిటీ నిర్మాణం చాలా మేలు చేయబోతోంది. ఈ విధంగా ప్రభుత్వం పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించే బృహత్తర యజ్ఞాన్ని ప్రారంభించింది. (చదవండి: కోఠి కాలేజ్‌ భవితవ్యం ఏమిటి?)

- డాక్టర్‌ ఎన్‌. యాదగిరి రావు 
వ్యాసకర్త జీహెచ్‌ఎంసీ అదనపు కమీషనర్‌

Advertisement
Advertisement