రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత! | Sakshi
Sakshi News home page

రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!

Published Tue, May 28 2024 6:06 AM

Sakshi Guest Column On Voter

విశ్లేషణ 

దేశంలో ప్రతిష్ఠాత్మక మూల స్తంభాలలో ఒకటైన ఎన్నికల కమిషన్‌ తన స్ఫూర్తిని కోల్పోతోందా? ‘ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎలక్షన్స్‌’ (స్వేచ్ఛగా, పారదర్శకంగా) ఎన్నికలు నిర్వహించటం భారత ఎన్నికల సంఘం కర్తవ్యం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత అవశ్యం.  కానీ ఆ కర్తవ్యం గాడి తప్పితే? ఆ స్ఫూర్తి మసకబారితే? ఫలితం ఏమవుతుంది?

ప్రస్తుత ఎన్నికల కమిషన్‌ పోకడలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) సంస్థల లాగే ఎన్నికల కమిషన్‌ కూడా అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందని వినవస్తున్న విమర్శలకు అనేక సంఘటనలు ఊతమిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న వేళ విపక్షాల నుంచి కుప్పల కొద్దీ సాక్షాధారాలతో సహా ఫిర్యాదులు అందుతున్నా ఈసీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.  

అప్పుడప్పుడు ఈసీ పేపర్‌  టైగర్‌లా గాండ్రించడమే తప్ప కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో పలుచోట్ల జరిగిన అల్లర్లను ఉదాహరణగా చెప్పవచ్చు. ఆశ్చర్యం ఏమిటంటే, అల్లర్లు జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ కమిషన్‌ శుద్ధపూసలంటూ ప్రత్యేకంగా నియమించిన పోలీసు అధికారులు ఉన్న ప్రాంతాలే కావడం గమనార్హం! 

కూటమి, అందులో భాగస్వామురాలైన బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇచ్చిన అధికార్ల చిట్టాను కించిత్తు వెరపు లేకుండా ఈసీ స్వీకరించి తదనుగుణంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వాదులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రౌడీ మూకలు  రెచ్చిపోతుంటే పోలీసులే నిర్లిప్తంగా వ్యవహరించటం, సాక్షాత్తూ్త పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలోకి చొరబడి సీసీ కెమెరాలు పగలగొట్టడం, అటు పోలీసు వ్యవస్థ ప్రతిçష్ఠను, ఇటు ఈసీ వ్యవస్థను దిగజార్చిందని చెప్పాలి. 

ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం, పాక్షిక దృష్టితో కొంతమంది కేసుల్లో పది రోజులు దాటిన తర్వాత క్రొంగొత్త సెక్షన్లను పొందుపరచడం గమనార్హం. ఎవరి ఆదేశాల మేరకు ఈసీ ఈ పనిచేస్తుందో చెప్పాలని సామాజికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో టీఎన్‌ శేషన్‌ ఎన్నికల సంస్కరణలకు తెర తీసి తన నిక్కచ్చితత్వంతో చరిత్రలో మిగిలిపోయారు. 1977 పోస్ట్‌ ఎమర్జెన్సీ ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరుకి యావత్‌  భారతదేశం జేజేలు పలికింది. వాజ్‌పేయి అనంతరం సరిగ్గా 25 ఏళ్ల తర్వాత 2014లో బీజేపీ మోదీ నేతృత్వంలో అధికారాన్ని కైవసం చేసుకున్నాక ఈసీ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతూ వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. 

గతంలో బ్యాలెట్‌ బాక్స్‌లు ఉపయోగంలో ఉన్నప్పుడు కొన్ని సున్నిత ప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌ల స్వాధీనం, బ్యాలెట్‌ బాక్సుల్లో  ఇంకు పోయడం, బాక్స్‌లు ఎత్తు్తకెళ్ళిపోవడం వంటి సంఘటనలు జరిగేవి. అయితే ఈవీఎంలు వచ్చిన తరువాత ఈ అక్రమాలకు తెరపడ్డాయని చెబుతున్నా... ఎన్నికలు సజావుగా నిర్వహించవలసిన ఎన్నికల కమిషన్, సిబ్బంది, అందులో ప్రధానంగా పోలీసు వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తే ఇక ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజా స్వామ్యవాదులను కలవరపెడుతున్నాయి. ఏకంగా బహిరంగంగా పోలీసులు, బాబు కూటమి కలసి తెగబడి అల్లర్లు ఆందోళనలు సృష్టిస్తే ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం దారుణం. ఢిల్లీకి వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తే తప్ప కనీస మాత్రం స్పందన లేదంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎలాంటిదో గమనించవచ్చు. 

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) సెక్షన్‌ 171 ప్రకారం ఓటర్లను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం శిక్షార్హం.  ప్రజా ప్రాతినిధ్య చట్టం  1950లోని సెక్షన్‌ 123 ప్రకారం భయపెట్టినా, ఓటర్లను ప్రలోభపెట్టినా  కూడా శిక్షార్హమే! అయినా జాతీయస్థాయిలో అధికార పార్టీ అండ చూసుకొని అనేక చోట్ల ఈ శక్తులు పెట్రేగిపోతున్నాయి. అరాచకాలను గమనించిన భారత అత్యున్నత న్యాయస్థానం శాసన సభ, పార్లమెంటు సభ్యులపై నమోదయ్యే కేసులను సత్వరం విచారించి శిక్షించడానికి ప్రత్యేక కోర్టులు ఉండాలని ఆదేశించింది. 

ఫలితంగా తెలంగాణలో ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకి 395 కేసులు బదిలీ అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే... ఇందులో కేవలం 14 కేసులకు మాత్రమే నామమాత్రపు శిక్ష పడింది. మిగతా వాటికి సాక్ష్యాధారాలు సరిగా లేవని కొట్టివేయడమైనది. అదీ పవర్‌ పాలిటిక్స్‌ అంటే!  ఎన్నికల కమిషన్‌ ప్రకటనలు అయితే చాలా ఆర్భాటంగా ఉంటాయి. ఈసారి గతంలోలా కాదు చాలా కఠినంగా వ్యవహరిస్తాం... నిష్పాక్షికంగా వ్యవహరిస్తాం అంటూ ప్రకటనలు అయితే ఇస్తారు. 

అంతేనా? ఏకంగా ప్రజలను కూడా అంటే ఓటర్లను కూడా నిఘా వ్యవస్థలో భాగస్వాములను చేస్తాం అంటూ ఘనంగా ‘సీ విజిల్‌ యాప్‌’ రూపొందించారు. దీని ప్రకారం, ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్టు ఓటర్‌ ఫిర్యాదు చేస్తే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌  100 నిమిషాల్లో ఆ నియోజకవర్గ పరిధిలోని అధికారులకు సూచనలు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటుంది. ఇది వినడానికి అయితే అద్భుతంగా ఉంది కానీ వాస్తవంలో జరిగిందేమిటి? అనేక చోట్ల ఎస్సీ, ఎస్టీ మహిళలు ఓట్‌ వేయడానికి వెళితే వాళ్ళని బెదిరించి, పరిగెత్తించడం పోలీసుల సమక్షంలో గూండాలు వ్యవహరించిన తీరు వీడియోల్లో రికార్డ్‌ అయింది. ఫిర్యాదులు చేసి రోజులు గడుస్తున్నా చర్యలు శూన్యం. 

వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం పక్షపాతంగా వ్యవహరించే పోలీసులకు విధుల్లో కొనసాగే హక్కు లేదని, ఓటర్లను భయపెట్టే నేతలపై అనర్హత వేటు వేయాలన్న ‘లా కమిషన్‌’ సిఫార్సులు అమలు చేయాలి. కానీ కనుచూపు మేరలో అలాంటిదేమీ కనిపించడం లేదు. సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ సూచించిన విధంగా మచ్చ లేనివారిని ఎన్నికల కమిషనర్లుగా నియమించాలి.  కానీ ఇవన్నీ జరిగేదెప్పుడు? సగటు ఓటరుకు రక్షణ ఎప్పుడు? అయితే ఒకటి మాత్రం నిజం. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల రణక్షేత్రంలో వీరులు సగటు ఓటరులే! వారి తీర్పుకు తిరుగులేదు. వారి పైన ఆంక్షలు తాత్కాలిక చంద్ర గ్రహణాల వంటివి. అంతిమంగా పున్నమి వెలుగులు జగన్మోహనంగా విస్తరించక మానవు. 

పి. విజయబాబు 
రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు  

Advertisement
 
Advertisement
 
Advertisement