స్కిల్‌ పెంచండి బాబులూ..! | Sakshi Guest Column On Skills | Sakshi
Sakshi News home page

స్కిల్‌ పెంచండి బాబులూ..!

Published Fri, Sep 15 2023 1:59 AM | Last Updated on Fri, Sep 15 2023 2:00 AM

Sakshi Guest Column On Skills

స్కిల్స్‌ పలు రకాలు.. ఏ ‘స్కిల్‌’ ప్రమాదకరమో మొన్నీమధ్యే చూశాం కదా, అలాంటివి కాదు. మనకూ జనానికీ ఉపయోగపడేవి. ఆ స్కిల్స్‌ చూడండి సరదాగా...

సేల్స్‌.. స్కిల్‌
ఓ పెద్దమనిషి, అరవై ఏళ్లకు పైబడి ఉంటాడు. జోరు వర్షంలో గొడుగేసుకుని  ఒక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద పుస్తకాలు అమ్ముతున్నాడు. అప్ప టికే బాగా చీకటి పడింది. ఇది  ఆసక్తిగా అనిపించి  ఓ యువకుడు కారులోనుంచే.. ‘పుస్తకం ఎంత’ అని అడిగాడు.

‘మూడువేల రూపాయలు.  కానీ,  నీకు అమ్మబోను. నీకు ఈ పుస్తకం చదివే ధైర్యం ఉన్నట్టు లేదు,’ అన్నాడు
‘‘నాకు చాలా ధైర్యం ఉంది. గంటలో లాగించేస్తాను.’ – అన్నాడా యువకుడు  కాస్త రోషంతో.
‘‘..అయితే ఒక షరతు మీద ఈ పుస్తకం నీకు అమ్ముతా, అది ఓకే అయితే నీకు ఓ వంద డిస్కౌంట్‌ కూడా ఇస్తా..’’ అన్నాడా పెద్దమనిషి
‘‘ఏమిటా షరతు?’’

‘‘నువ్వు జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. చాలా బాధపడతావు.’’
‘‘ఓకే ప్రామిస్‌!.. నేను ధైర్యవంతుడినే అయినా,  చివరి పేజీ చదవను, ఇదిగో డిస్కౌంట్‌ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు..’’ అంటూ మనీ పెద్దమనిషి చేతిలో పెట్టాడు. 

పెద్దమనిషి డబ్బులు తీసుకుని పుస్తకం ఇస్తూ షరతు గురించి మళ్లీ గుర్తు చేశాడు. పుస్తకం తీసుకున్న యువకుడు ఇంటికి వెళ్లి భయం, భయంగా పుస్తకం చదివేశాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌ బుక్‌ అది.. కొంచెం క్రైమ్, కొంచెం సస్పెన్స్‌ ఉన్నా... మరీ అంత భయంకరంగా లేదు. 

చివరి పేజీ  ఎందుకు చదవ వద్దన్నాడా  పెద్దమనిషి? దానిలో అంత తట్టుకోలేని  బాధ  ఏముంటది? అని మనవాడికి డౌట్‌ వచ్చింది. చదువుదామని మనసు పీకింది.  కాస్త భయం వేసింది. ప్రామిస్‌ను పక్కన పెట్టి... గుండె దిటవు చేసుకుని భయం భయంగా చివరి పేజీ చూస్తే నిజంగానే గుండె ఆగినంత పనైంది.. ఆ చివరి పేజీలో ఇలా ఉంది ‘పుస్తకం ఖరీదు 50 రూపాయలు...’
ఇదీ సేల్స్‌ స్కిల్‌... అంతే కదా?
... 
ఇక ఈ తరహా తెలివితేటలు చూడండి.
సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉంది.

మేడిన్‌ ఇండియా!
ఒకసారి అమెరికా కంపెనీలో సబ్బుల ఫ్యాక్టరీలో ఒక  పొరపాటు జరిగింది. కొన్ని  కవర్లు  ప్యాక్‌ అయ్యాయి కానీ, అందులో సబ్బుల్లేవు. డీలర్లు, కస్టమర్ల గొడవ.. పెద్దగోలయ్యింది. దానితో యాజమాన్యం కంపెనీలో ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడూ రాకూడదనీ, పరువు పోకూడదనీ జాగ్రత్త కోసం ఆరు కోట్లు పెట్టి ఎక్స్‌రే మెషీన్‌ కొన్నదట. ప్యాకైన సబ్బులు వెళుతుంటే అందులో సబ్బు ఉన్నదీ లేనిదీ ఆ మెషీన్‌ ద్వారా కనుక్కుని తీసేయడానికి వీలయ్యింది.  

ఈ విషయం హైదరాబాద్‌ సబ్బుల కంపెనీలో  మీటింగ్‌లో  ప్రస్తావనకు వచ్చింది.  ఆ అమెరికా కంపెనీలో పనిచేసి  ఇక్కడికి వచ్చిన ఎగ్జిక్యూటివ్‌  ఒకరు  ఆ దేశ టెక్నాలజీని, వాళ్ల స్కిల్‌ను. శ్రద్ధను చిలవలు పలవలుగా వివరిస్తున్నాడు. ఆ మీటింగ్‌లో చాయ్‌ బిస్కట్‌ ఎంజాయ్‌ చేస్తున్న  మనోడు లేచి,‘‘ఎందుకు సర్‌ 6 కోట్లు తగలేశారు.

ఓ 3వేలు పెట్టి  ‘పెడెస్టెల్‌ ఫ్యాన్‌’ కొని స్పీడ్‌గా తిప్పితే ఖాళీ ప్యాకెట్లు ఎగిరిపోతాయిగా. పొరపాటున ఖాళీగా వచ్చేవి ఒకటీ రెండేగా’’... అనేసి  మళ్లీ చాయ్‌ బిస్కట్‌ మీద పడ్డాడు. దీనితో అమెరికా ఎగ్జిక్యూటివ్‌ అవాక్కయ్యాడు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి.. అన్న సామెత అన్నిచోట్లా వర్తించదు. ఎంత పాముకు అంత కర్ర.. అదీ సరైన సమయంలో. 
– ఇదీ ఓ రకమైన జాబ్‌ స్కిల్లే కదా!

నో స్కిల్‌... 81 పర్సెంట్‌...
ఇంతకీ స్కిల్లు గురించి ఎందుకీ సొల్లు అంటారా? అత్యుత్తమ ఔట్‌పుట్‌ ఇవ్వగల నైపుణ్యాలు ఉద్యోగుల్లో ఉండటం లేదట.  ఒకటో, రెండో కాదు.. ఐటీ రంగంలో ఏకంగా 81 శాతం సంస్థలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఈవై, ఐమోచా సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. మంచి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం డిమాండ్‌ పెరుగుతోందని తేలింది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ఉద్యోగుల్లో పని నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీలపై అవగాహన అంశాలపై ఈవై, ఐమోచా సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ‘టెక్‌ స్కిల్స్‌లో మార్పులు – ఆ తర్వాత పని పరిస్థితులు’ పేరిట ఇటీవల నివేదికను విడుదల చేశాయి.

– ప్రస్తుత డిజిటల్‌ యుగంలో పోటీలో నిలిచేందుకు వీలుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాయనీ.. కానీ వాటికి తగినట్టుగా నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు దొరకడం కష్టమవుతోందనీ నివేదిక వెల్లడించింది. ఒక్క ఐటీ రంగం మాత్రమే కాకుండా... బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, డేటా అనాలసిస్‌ వంటి ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది.

– అప్లికేషన్  డెవలపర్లు, పవర్‌ యూజర్‌ స్కిల్స్‌ ఉన్నవారికి డిమాండ్‌ పెరగడం కూడా కొరత నెలకొనడానికి కారణమని నివేదిక పేర్కొంది.

స్కిల్‌ ఉంటేనే జాబులు...
– సర్వేలో పాల్గొన్న  చాలా సంస్థలు డెవలపర్, పవర్‌ యూజర్‌ నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. కొత్త టెక్నాలజీలు, అవసరాలకు అనుగుణంగా ఏ ఉద్యోగానికి ఏ నైపుణ్యాలు తప్పనిసరి అనే విభజనను అనుసరిస్తున్నామని 19 శాతం కంపెనీలు తెలిపాయి. 43 శాతం కంపెనీలు ఉద్యోగుల స్థాయిలో నైపుణ్యాల పరిశీలన చేపట్టామన్నాయి.

ఈ విభజన/పరిశీలన క్రమంలో చాలా మంది ఉద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాలు లేనట్టుగా గుర్తించామని వెల్లడించాయి. ఈ క్రమంలో ఓవైపు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మరోవైపు మంచి స్కిల్స్‌ ఉన్నవారిని చేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు వివరించాయి.

స్కిల్స్‌ పెంచేద్దాం...
ప్రస్తుతం ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధులు, అందుకు అవసరమైన నైపుణ్యాల్లో ఎన్నడూ లేనంత వేగంగా మార్పులు వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. 2025 నాటికి తమ సంస్థల్లోని మూడో వంతు ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను గణనీయంగా పెంపొందించాల్సిన అవసరం ఉందని 28 శాతం సంస్థలు భావిస్తున్నాయనీ  వివరిస్తోంది. మరో 62శాతం కంపెనీలు కనీసం 15 శాతం మంది ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపు తప్పనిసరి అని భావిస్తున్నట్టు తెలిపారు.

ఇండియాలోనూ అంతే.. 
భారతదేశంలోని 60 శాతానికి పైగా కంపెనీలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను  ఎదుర్కొంటున్నట్టు ఇటీవలి ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌’ నివేదికలో ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్‌) కూడా పేర్కొంది. ముఖ్యంగా చదువు పూర్తిచేసుకుని కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్నవారికి తగిన నైపుణ్యాలు ఏమాత్రం ఉండటం లేదని వెల్లడించింది. ఉద్యోగుల్లో నైపుణ్యాల కల్పనకు తోడ్పడే అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్, ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ వంటి వాటిని భారత్‌లో ఉపేక్షిస్తున్నారని పేర్కొంది.

ముఖ్యంగా కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్స్‌ కల్పించేలా విద్యా రంగంలో సంస్కరణలు రావాల్సి ఉందని అభిప్రాయపడింది. 
సరికొండ చలపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement