పత్రికా స్వేచ్ఛ కొందరికే ప్రత్యేకమా? | Sakshi Guest Column On Press freedom exclusive to a few | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛ కొందరికే ప్రత్యేకమా?

Jul 3 2025 12:37 AM | Updated on Jul 3 2025 12:37 AM

Sakshi Guest Column On Press freedom exclusive to a few

ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే పదాలు గడచిన మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదాలు. బీఆర్‌ఎస్‌ నాయకులపై జుగుప్సాకరమైన థంబ్‌నైల్స్‌ పెట్టి వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు మహా టీవీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడి ముమ్మాటికీ ఖండనార్హమే. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదు. ఎవరు ఎవరిపై దాడి చేసినా కచ్చితంగా ఖండించాల్సిందే. ఇదే సమయంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛలు కొందరు ప్రత్యేకమైన జర్నలిస్టులకు, సెలక్టివ్‌ మీడియా గ్రూపులకు మాత్రమే ఉంటాయా? ఇంకెవరికీ ఉండవా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్య ప్రజానీకాన్ని తొలిచేస్తున్నాయి.

మహా టీవీ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఛోటోమోటా నాయకులు సైతం తీవ్ర స్థాయిలో స్పందించి దాడిని తీవ్రాతి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా సంస్థలపై దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. సరిగ్గా ఇక్కడే సామాన్య ప్రజానీకం గందరగోళానికి గురవుతున్నారు. 

ఈ దాడి జరగడానికి మూడు వారాల ముందు ‘సాక్షి’ టీవీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఒక జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై సదరు జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను, చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్‌కూ, ‘సాక్షి’ యాజమాన్యానికీ ముడి పెట్టి ఏపీలో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. 

గతంలో మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కేసులు వేసినప్పుడు ఇది మీడియాపై దాడి అని రామోజీరావు అంటే... ఇవే రాజకీయ పార్టీలు, నాయకులు స్వరం కలపడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏకంగా యాంకర్‌గా వ్యవహరించిన సీనియర్‌ జర్నలిస్టుపై అట్రాసిటీ కేసు కూడా పెట్టి అరెస్ట్‌ చేసింది. 

అయితే ఈ సందర్భంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, టీడీపీ మహిళా కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని ‘సాక్షి’ పత్రిక ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి దాడులకు పూనుకున్నారు. ఆస్తులు ధ్వంసం చేశారు. కానీ ఈ సంఘటన ప్రజాస్వామ్యం మీద, పత్రికా స్వేచ్ఛ మీద దాడిలా ఎవరికీ కనిపించకపోవడం విచిత్రం. ఏకంగా పదికి పైగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తే ఒక్క కేసు లేదు, ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.

అదే తెలంగాణకు వచ్చే సరికి... బీఆర్‌ఎస్‌ నాయకులపైనా, ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పైనా జుగుప్సాకరంగా పెట్టిన థంబ్‌నైల్స్‌పై ఆగ్రహానికి గురైన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో సదరు టీవీ యాజమాన్యానికి సుద్దులు చెప్పడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. పైగా టీవీ ఛానల్‌కు అండగా నిలబడుతూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల చర్యను తీవ్రంగా ఖండించారు. సాక్షిపై దాడి విషయంలో సమర్థింపు మాటలు మాట్లాడిన ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌  ఇప్పుడు మహా టీవీపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు అర్థంకాక సామాన్య ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.

ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి రాజకీయ పార్టీలు సొంతగా మీడియా సంస్థలు కలిగి ఉండటం తగదని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు మీడియా సంస్థలు కలిగి ఉండటం ఈ నాటిది కాదు. కాంగ్రెస్‌ పార్టీ సొంతగా నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ఎన్నో దశాబ్దాలుగా నడుపుతోంది. వామపక్షాలు సైతం ప్రతి రాష్ట్రంలో ఎప్పటి నుంచో సొంత పత్రికలు నడుపుతున్నాయి. ఇక బీజేపీ ఎంపీలు ఒకరిద్దరికి మీడియా సామ్రాజ్యాలే ఉన్నాయి. 

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీడియా సంస్థను ప్రారంభించారు. ఇప్పుడు అది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంత మీడియా సంస్థ అయ్యింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు ఎప్పటి నుంచో వార్తా పత్రికలు ఉన్నాయి. విశాలాంధ్ర పేరుతో సీపీఐ, ప్రజాశక్తి పేరుతో సీపీఎం పార్టీలు దశాబ్దాలుగా పత్రికలు నడుపుతున్నాయి. అలాగే 10 టీవీ పేరుతో సీపీఎం, 99 టీవీ పేరుతో సీపీఐలు చెరో శాటిలైట్‌ న్యూస్‌ ఛానల్‌ను ప్రారంభించాయి. 

ఇప్పుడు ఆ ఛానళ్ళ యాజమాన్యాలు మారినప్పటికీ అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో చాలా మంది పార్టీల అనుబంధ సభ్యులే. ‘ఈనాడు’ రామోజీరావు స్వయంగా తాను కాంగ్రెస్‌కు బద్ద వ్యతిరేకినని న్యాయస్ధానాల్లో చెప్పుకున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మంత్రి వర్గ కూర్పు, తనకు నచ్చని మంత్రులను క్యాబినేట్‌ నుంచి తీసివేయించే వరకూ ‘ఈనాడు’ ఎంత కీలకంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలందరికీ చర్విత చరణమే. 

ఇక ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ టీడీపీ కోసం ఏ విధంగా పనిచేస్తారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాధాకృష్ణ సహాయంతో టీడీపీలో టిక్కెట్లు ఖరారు చేయించుకున్న నాయకులెందరో లెక్కలేదు. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 7 గంటలు అవ్వగానే సాంబశివరావు అనే జర్నలిస్ట్‌ టీవీ 5 తెరమీదకు వచ్చి ఏడెనిమిది నిమిషాల పాటు ధర్మోపన్యాసం చేస్తూ జగన్‌ను తిట్టడం, చంద్రబాబును పొగడటం నిత్యకృత్యం అన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. 

సాంబశివరావు అటు వెళ్లిన వెంటనే ఇటు మూర్తి అనే మరో జర్నలిస్టు రాత్రి 9 గంటలకు వచ్చి ఇచ్చే ప్రవచనాలు వర్ణనాతీతం. ఈ ఇద్దరి మధ్యలో రాత్రి 8 గంటలకు ‘ఏబీఎన్‌  ఆంధ్రజ్యోతి’ అనే ఛానల్లో వెంకట కృష్ణ సూక్తిముక్తావళి ఉంటుంది. దీని సారంశం కూడా జగన్‌ను ఆడిపోసుకోవడం, చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం! వీరందరి మధ్యలో మహా టీవీ వంశీ తనదైన శైలిలో న్యూస్‌ రూమ్‌లో కూర్చుని దర్బార్లు నడిపిస్తాడు. టీడీపీ సహజీవనం చేసే ఈ మీడియా సంస్థలు అన్నీ ఇప్పుడు ముసుగులు వేసుకుని ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతుంటే నమ్మే పరిస్థితుల్లో తెలుగు సమాజం లేదన్న విషయం అందరూ గుర్తించాలి. 
– రుద్రుడు ‘ తెలుగు పాఠకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement