చర్చకు తావిచ్చే బోధన లేకపోతే...

Sakshi Guest Column On NCERT Textbooks

విశ్లేషణ

ఎంపిక చేసిన అధ్యాయాలను, పేరాలను, చిత్రణలను ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడానికి జ్ఞాన రాజకీయాలే దారి తీశాయి. కానీ అసలు సమస్యను విస్మరిస్తున్నాం. తరగతి గదులు ప్రేరణారహితంగా ఉండిపోవడాన్ని మనం విస్మరిస్తున్నాం. పాఠంలో పొందుపర్చిన జ్ఞాన గుళికను విద్యార్థులకు అందించడం కంటే మించిన పాత్ర టీచర్‌కి ఏమీ ఉండటం లేదు.

ఘనీభవించిన పదాలను కంఠస్థం చేసే కళలో విద్యార్థులు నైపుణ్యం సాధించేలా చేయాలని టీచర్లను కోరుతున్నారు. కమలా దాస్‌ కవిత్వం, ఆర్కే లక్ష్మణ్‌ కార్టూన్‌ వంటి వాటిని బోధనా సాధనంగా చేసినప్పటికీ అవి కేవలం రెండు మార్కుల ప్రశ్నగా మాత్రమే కుదించబడతాయి. అర్థవంతమైన విద్య అంటే పాఠ్యపుస్తకాన్ని దాటి విద్యార్థిని ఎదిగేలా చేయాలి.

భావజాలం, కరిక్యులమ్‌కి చెందిన గతి శాస్త్రం గురించి ఇప్పటికే చాలా చాలా చర్చ జరిగింది. ఎంపిక చేసిన అధ్యాయాలను, పేరాలను, చిత్రణలను, సమాచారాన్ని ఎన్‌సీఈఆర్టీ స్కూల్‌ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడానికి జ్ఞాన రాజకీయాలే దారి తీశాయి.

రాజకీయంగా చేపట్టిన ఈ తొలగింపుపై ఉదారవాద వామపక్ష అకడెమిక్‌ సమాజం తన ఆగ్ర హాన్ని, విచారాన్ని వ్యక్తం చేయగా, ఈ విషపూరిత సమయాల్లో ఎన్‌సీఈఆర్టీని నడుపుతున్న విద్యావిషయకమైన ఉన్నతాధికార వర్గం... హేతుబద్ధీకరణ పేరిట లేదా విద్యాపరమైన భారాన్ని తగ్గించడం, తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించడం పేరిట ఈ చర్యను చట్టబద్ధం చేసింది.

అయితే, ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలపై చర్చ తరగతి గది కమ్యూ నికేషన్‌ నిజవాస్తవికతను మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది. అవును, ఈ చర్చలో, జ్ఞాన విషయాలను నిర్వచించి, తీర్చిదిద్దడానికి హిందుత్వం దాని ఆధిపత్యపు త్వరిత లక్షణం వేగంగా పెరుగుతుండటంలోని ఆసక్తికరమైన ప్రతిఫలనాలను చూశాం.

వీటన్నింటికి మించి, మన పిల్లలు ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు అనే అంశాన్ని కొత్త బాస్‌లు నిర్ణయించే అధికారం కలిగి ఉన్నందున, అతి జాతీయవాద సిద్ధాంతకర్తలు ఉదారవాద వామపక్ష చరిత్రకారులను, సామాజిక శాస్త్రజ్ఞులను పక్కకు పెడుతున్న అధికార మార్పిడి పర్యవసానాలను కూడా అనుభూతి చెందాం.

తమతమ రాజకీయ దృక్పథాలు ఏవైనప్పటికీ మన అకడమిక్‌ బాస్‌లు కిక్కిరిసిపోయిన తరగతి గదుల్లో బోధన, అభ్యాసానికి చెందిన మూసపోత చర్యపై తగినంత శ్రద్ధ పెట్టలేదని అంగీకరించడానికి తగినంత నిజాయితీని మనం కలిగివుండాలి. నిజానికి, పాఠశాల అధ్యాపకులు కేవలం మధ్యవర్తుల పాత్రకు పరిమితమయ్యారు. టీచర్లు చెప్పేదేమీ ఉండదు, వారి విద్యార్థులు కూడా ఖాళీ పాత్రల్లాగ ఉండిపోతున్నారు.

పైగా, పాఠ్యపుస్తకాల స్వభావాన్ని ప్రతి ఫలించే కరిక్యులమ్‌ రూపకల్పనలో లేదా తగిన బోధనా కళను వికసింప చేయడంలో ఎలాంటి కీలకపాత్రను పోషించడానికి కూడా వారిని ప్రోత్సహించడం లేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్కాలర్లు, ఉదార వాద మేధావులు వంటి పెద్ద హోదాకలిగిన వారు లేదా వర్త మాన భారత్‌లో మితవాద సిద్ధాంతకర్తలు పాఠశాల కరిక్యులమ్‌లో దేనిని పొందుపర్చాలనే విషయాన్ని నిర్ణయిస్తున్నారు.

పాఠంలో పొందుపర్చిన జ్ఞాన గుళికను విద్యార్థులకు అందించడం కంటే మించిన పాత్ర టీచర్‌కి ఏమీ లేదని భావిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఘనీభవించిపోయిన పదాలను కంఠస్థం చేసే కళలో విద్యార్థులు నైపుణ్యం సాధించేలా చేయాలని టీచర్లను కోరుతున్నారు.

వల్లె వేయడం కంటే మరే ప్రాధాన్యతా లేని, ఏమాత్రం కల్పనాశక్తి లేని సమాధానాలను వారిచేత రాయించాలని మాత్రమే సూచిస్తున్నారు. పైగా, పాఠ్యపుస్తక నిరంకుశత్వం (లేదా వ్యూహాత్మక ఎంపికలాగా, గైడ్‌ బుక్స్‌) ఏది విలువైన బోధనో నిర్వ చిస్తున్నప్పడు, సిలబస్‌కి వెలుపల మరేదీ లేనప్పుడు, అధ్యాపక సృజ నాత్మక వ్యవస్థ మెల్లగా కృశించిపోవడానికే దారితీస్తుంది.

అంతకుమించి, బ్రెజిలియన్‌ విద్యావేత్త పౌలో ఫ్రియరీ చెప్పి నట్లుగా, విద్యను ప్రధానంగా అధికారిక సిలబస్‌పై ఆధారపడిన పరీక్షలతో సమానం చేసి చూసే వ్యవస్థ... సమస్యలను ఎత్తిచూపే విద్యగా ఉంటుంది. ఇది విద్యా కళను ప్రాక్టీస్‌ చేసే టీచర్లను, విద్యా ర్థులను ప్రేరణా రహితులుగా చేస్తుంది. అందుచేత మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే రాజకీయాలను యువ అభ్యాసకులు తెలుసుకోకూడదని మెరుగులు దిద్దిన ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకం భావిస్తున్నట్లయితే దాన్ని అలాగే చేయనివ్వండి.

టీచర్, విద్యార్ధి ఇరువురూ పాఠాన్ని దాటి తదుపరి విచారణ, పరిశీలనకు ప్రయత్నించి, ఆ పుస్తకం ‘పవిత్రత’ను వివాదాస్పదం చేయడం, పాఠం దాచి పెట్టిన విషయం ఏమిటని చూడవలసిన అవసరం ఏమిటి? ఉదా హరణకు, ఎమర్జెన్సీ బీభత్సం, 2002 గుజరాత్‌ అల్లర్లు రేపిన హింసాకాండ, అభివృద్ధికీ, నిరాశ్రయులకూ సంబంధించిన సమస్య, నర్మదా బచావ్‌ ఆందోళన లేవనెత్తిన పర్యావరణ సమస్య వంటి సిలబస్‌కు వెలుపల ఉన్న వాటిని తెలుసుకోవడానికి వారెందుకు ఆరాటపడాలి?

పాఠ్యపుస్తకాలపై మితవాద దాడిని విమర్శించడానికి చాలా కారణాలు ఉంటున్నప్పటికీ, మన క్లాసు రూమ్‌లలో పరావర్తన రహిత, సంభాషణకు తావులేని ప్రస్తుత విద్యాభ్యాసంలో రొమిల్లా థాపర్, కృష్ణకుమార్‌ వంటి విద్యావేత్తల దృక్పథాలను ఎన్‌ సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చినప్పటికీ, వాటిని మౌలికంగా మార్పు లకు గురిచేయవచ్చు. నిజానికి, ఎమ్‌సిక్యూ(బహుళైచ్ఛిక)–కేంద్రక ప్రామాణీకృత పరీక్షల యుగంలో లేదా బోర్డు పరీక్షల్లో 99 శాతం మార్కుల సాధనకోసం మానసిక ఒత్తిడి ఉంటున్న యుగంలో ప్రతి ఒక్కటీ తలకిందులుగా మారుతుంది.

పాబ్లో నెరూడా లేక కమలా దాస్‌ కవిత్వం, లేదా ఆర్కే లక్ష్మణ్‌ కార్టూన్‌ వంటి వాటిని బోధనా సాధనంగా చేసినప్పటికీ అవి కేవలం రెండు మార్కుల ప్రశ్నగా మాత్రమే కుదించబడతాయి. వల్లె వేసే విద్యాభ్యాసం ద్వారా అవి సత్వరం వినియోగమయ్యే సరుకులుగా మారతాయి. ఒక విషయాన్ని అంగీకరించాలి. చింతనాపరులు, సమర్థులైన పరిశోధక విద్యార్థులు లేదా సృజనాత్మక మనస్సులతో పనిలేకుండా యాంత్రికంగా టాపర్ల ఉత్పత్తిని ఆరాధించే వ్యవస్థ ఇక్కడ ఉంది.

బోధనా వృత్తిలో, ప్రత్యేకించి పాఠశాల బోధనా వృత్తిలో నిజంగా స్ఫూర్తికలిగిన వ్యక్తులను రూపొందించడం, రిక్రూట్‌ చేయడం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? సృజనాత్మకంగా సూక్ష్మ విమర్శనాత్మక బోధన అభ్యాసం గురించి, గాంధీ లేదా సావర్కర్, ఔరంగజేబ్‌ లేదా శివాజీపై వామపక్ష లేదా మితవాద పక్ష పాఠాల విషయాలను దాటి చూడటానికి సాహసమున్న వారి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? దీనికి బదులుగా, టీచర్స్‌ని ప్రోత్సహిస్తూ, ప్రతి పిల్లాడినీ ప్రభావితం చేసే సంభావ్యతను, ఉద్ధరణ వాద విద్యలోని సంభాషణ, సంక్లిష్ట చింతన ప్రభావాన్ని విశ్వసించే వ్యవస్థ కోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.

విద్యార్థులు, టీచర్లు సంభాషిస్తూ, చర్చించుకుంటూ, అధికారిక సిలబస్‌ను దాటి చూసేటటువంటి సజీ వమైన, శక్తిమంతమైన తరగతి గదిని ఊహించుకోండి. భగత్‌ సింగ్‌ డైరీని చదవమంటూ ఎనిమిదవ తరగతి విద్యార్థులకు చెబుతున్న టీచర్‌ని, 1947–48లో గాంధీ ప్రార్థనల సమావేశాలపై వ్యాసం రాయాలని కోరే టీచర్‌ని, లేదా మాంటో రాసిన కథనాన్ని ప్రతిఫలింపజేయాలంటూ కోరుతున్న టీచర్‌ని మీరు ఊహించుకోండి.

లేదా, స్కూల్‌ లైబ్రరీ నుంచి రస్కిన్‌ బాండ్, ఆర్కే నారాయణ్‌ పుస్తకాలను తీసుకుంటున్న 7వ తరగతి యువ విద్యార్థిని ఊహంచుకోండి. తమ సాహిత్య సృజనలపై చర్చ ప్రారంభించాలంటూ హైయర్‌ టీచర్‌ని కోరుతున్న విద్యార్థినీ విద్యార్థినులను ఊహించుకోండి. ఇది పాఠ్య పుస్తకాన్ని (మేటి రచయితలు రాసినవైనప్పటికీ) కేవలం ఉత్ప్రేరకంగా మాత్రమే చూస్తూ, తర్వాత దాన్ని దాటి పోవడం అన్నమాట! ఈ
సృజనాత్మకమైన కీలకమైన ఫ్యాకల్టీని బలోపేతం చేసిన తర్వాత ప్రశ్నించే, విచారణ చేసే, సిలబస్‌ని దాటి చూసే మేధా, జ్ఞాన సామ ర్థ్యాన్ని పిల్లలు సహజంగా అభివృద్ధి చేసుకుంటారు.

అర్థవంతమైన విద్య గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి మనం నిజాయితీగా ఆలోచిస్తున్నట్లయితే, ఎన్‌ సీఈఆర్‌టీ పాఠ్య పుస్త కాల అధికారంపై వామపక్షవాదుల, మితవాదుల మధ్య రాజకీయ– సైద్ధాంతిక ఘర్షణను దాటి సమస్యను చూడాల్సిన అవసరం ఉంది.
అవిజిత్‌ పాఠక్‌ 
వ్యాసకర్త సోషియాలజిస్ట్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top