
ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలూ అందరినీ భయపెడుతున్నాయి. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో ఏం చేస్తున్నామో, ఎటు పోతున్నామో... చివరికది ఎటు దారితీస్తుందో తెలియనంతగా తల్లిదండ్రులు భయాందోళనల్లో మునిగిపోతున్నారు. వాటిని పిల్లలకూ అంటిస్తున్నారు. విద్యావ్యాపారంలో తలమునకలైన సంస్థలు దీన్ని ఎంచక్కా ఉపయోగించుకుంటున్నాయి.
పర్యవసానంగా పిల్లలపై ఒత్తిళ్లు పెరిగి, బెంగ ఎక్కువై ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. తరాలు మారుతున్నా వదలని ఈ జాడ్యంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టని నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఎన్నదగిన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్ని పీకల దాకా పోటీలో ముంచి, వారిపై మానసిక ఒత్తిళ్లను పెంచి విద్యలోని ప్రాణధాతువునే వికృతీకరిస్తున్న తీరు ఇకపై కొనసాగనీయరాదంటూ శుక్రవారం కోచింగ్ కేంద్రాలతోసహా అన్ని విద్యాసంస్థలనూ హెచ్చరించింది.
అవాంఛనీయమైన ఈ ధోరణిని అడ్డుకోవటానికి ప్రతి విద్యాసంస్థ తప్పనిసరిగా పాటించాల్సిన 15 అంశాలతో కూడిన మార్గదర్శకాలను జారీచేసింది. పిల్లల మార్కుల ఆధారంగా వర్గీక రించి బోధించే విధానాన్ని నిలిపివేయాలనటం మొదలుకొని కౌన్సెలర్లు, సైకాలజిస్టుల నియా మకం వరకూ అందులో విలువైనవెన్నో వున్నాయి.
ఆత్మహత్యలనేవి అన్నివేళలా వ్యక్తుల నిర్ణయమే కావొచ్చు... కానీ వాటిని ప్రేరేపిస్తున్న వ్యవస్థ మాటేమిటని ప్రశ్నించాడు ఫ్రెంచ్ తత్వవేత్త, రచయిత ఆల్బర్ట్ కామూ. మూలాన్ని గుర్తించకుండా, దాన్ని దుంపనాశనం చేయకుండా ఏ సమస్యా దానంతటదే మాయం కాదు. కేంద్రంలో రాజీవ్ గాంధీ హయాంలో విడుదలైన నూతన జాతీయ విద్యావిధానం విద్య ప్రైవేటీకరణకు బీజం వేసింది మొదలు మన విద్యావ్యవస్థ వెర్రితలలు వేస్తోంది.
చదువులో వెనకబడివున్నామనే ఆత్మ న్యూనతతో కొందరూ, తమకొచ్చిన మార్కుల్నీ/ర్యాంకునూ చూపించి తరగతి గదిలో టీచర్ ఎగతాళి చేశారనీ, దండించారనీ మరికొందరూ...పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలమో లేదో అనే ఆందోళనతో ఇంకొందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు కేసులు పెడతాయి. మళ్లీ మరొకటి జరగనంతవరకూ అంతా సవ్యంగా వున్నట్టే కనబడుతుంది.
ఇది చర్వితచరణంగా కొనసాగుతూనేవుంది. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలకు దారి తీసిన ఉదంతం విశాఖలోనే జరిగింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) కోసం విశాఖ విద్యా సంస్థలో చేరిన బెంగాల్ బాలిక భవనంపై నుంచి పడి మరణించిన ఉదంతంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌లో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
ఆమె ప్రమాదవశాత్తూ మరణించిందని ఒకసారి, గుండెపోటుతో మరణించిందని మరోసారి, ఆత్మహత్య చేసుకుందని ఇంకోసారి ఆ విద్యాసంస్థ బుకాయించింది. ఈ రోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థకూ వుంది. కన్నవాళ్లకు కనీసం పిల్లల మరణకారణాన్ని నిజాయతీగా చెప్పాలని కూడా ఆ సంస్థలు అనుకోవు. ధర్మాసనం వెల్లడించిన గణాంకాలు విస్తుగొలుపుతాయి.
2022లో మన దేశంలో 1.7 లక్షలకుపైగా ఆత్మహత్యలు నమోదైతే అందులో ఏడు శాతంపైగా – అంటే 13,404 మరణాలు విద్యార్థులకు సంబంధించినవి. జీవితం రంగులమయ ప్రపంచంగా దర్శనమిచ్చి, ఆకాశమే హద్దుగా భావించి దూసుకుపోవాల్సిన వయసులో పిల్లలు ఇంత బేలగా, ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయి తనువు చాలిస్తున్న వైనం సమాజానికంతకూ సవాల్.
చదువంటే తెలియనిది తెలుసుకోవటం, అవసరమైనప్పుడల్లా ప్రశ్నించి సందేహనివృత్తి చేసు కోవటం. సృజనాత్మకంగా ఆలోచించటం. నేటి విద్యావ్యవస్థ వాటన్నిటినీ చంపేసింది. పోటీ తత్వాన్ని ప్రతిష్ఠించింది. బట్టీపట్టడం మినహా మరేమీ లేకుండా చేసింది. పర్యవసానంగా ఎంతో ఇష్టంతో చదవాల్సిన విద్య కాస్తా పెను భారంగా, ఎంతకూ అర్థంకాని ప్రణాళికగా అఘోరిస్తోంది.
తమను అన్నివిధాలా రుద్దుతూ, పరుగులు పెట్టిస్తూ బలవంతంగా మెదళ్లలోకి ఎక్కించి ‘మంచి ఫలితాలు’ రాబట్టి మున్ముందు మరింత వ్యాపారం చేసుకోవాలని తాపత్రయపడే విద్యాసంస్థలొక వైపూ... తమ ఎదుగుదలపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులొక వైపూ విద్యార్థులకు ఊపిరి సలపనివ్వట్లేదు. ఆ ప్రస్థానంలో ఓటమి ఎదురయ్యేసరికి ఆ లేత హృదయాలు తట్టుకోలేకపోతు న్నాయి.
అర్ధంతరంగా తనువు చాలించటం మినహా మరే మార్గమూ లేదని నిర్ణయానికొస్తున్నాయి. అంతక్రితం వరకూ ఇంటర్ స్థాయి నుంచి మొదలయ్యే పోటీతత్వం కార్పొరేట్ సంస్థల పుణ్యమా అని ప్రాథమిక విద్యకు కూడా పాకింది. ఈ దుఃస్థితి మారాలన్నదే సుప్రీంకోర్టు సంకల్పం.
అయితే కనీసం స్వేచ్ఛగా కదలటానికైనా సావకాశంలేనంతగా ఇరుకైన స్థలాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు నడవటానికి ఎడాపెడా అనుమతులిచ్చే చోట పిల్లలకు క్రీడల్లో, జీవన నైపుణ్యాల్లో, వ్యక్తిత్వవికసనంలో శిక్షణనివ్వాలన్న ధర్మాసనం మార్గదర్శకాలు సక్రమంగా అమలవుతాయా? లాభాపేక్షే ధ్యేయంగావున్నచోట అదనంగా కౌన్సెలర్లకూ, సైకాలజిస్టులకూ చోటిస్తారా? టీచర్లపై ఊపిరాడనీయనంత భారంవేస్తున్న సంస్థలు పిల్లలతో ఎలా మెలగాలో వారికి శిక్షణనిప్పిస్తాయా? పిల్లలు తమ బాధల్ని చెప్పుకోవటానికి అవసరమైన వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తాయా? డబ్బు ఎరవేసి ఎంతటి మహోన్నత ఆశయాలనైనా చాపచుట్టేయగలిగే కార్పొరేట్ సంస్థలు ఈ మార్గ దర్శకాలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెబితే తప్ప ఇదంతా చక్కబడదు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వాలి.