
ఇంటర్మీడియెట్‌లో సగం దాటని ప్రవేశాలు
ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు
రాష్ట్రంలోని 475 కాలేజీల్లో సగంపైగా సీట్లు ఖాళీ
పిల్లల సంఖ్య డబుల్ డిజిట్ దాటని కళాశాలలు 200పైనే
గత సర్కారు పథకాలను నీరుగార్చడంతో పాటు కూటమి ప్రభుత్వ వికట ప్రయోగాల ఫలితమిది
ఇష్టానుసారంగా హైస్కూల్ ప్లస్‌ల రద్దు
గత ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టి.. ఈ ఏడాది అరకొరగా అమలు
డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఆరు త్రైమాసికాల ఫీజు బకాయి
వసతి దీవెనను కూడా పట్టించుకోని వైనం
రెండూ కలిపి రూ.6,400 కోట్లు బకాయి
ఫలితంగా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి ప్రైవేట్ బాట
గతేడాది మొదటి సంవత్సరంలో 70,677 మంది చేరిక
ఈ ఏడాది మూడింట రెండో వంతు కూడా గగనమే
కర్నూలు జిల్లా దేవనకొండ జూనియర్ కాలేజీలో గతేడాది ఇంటర్ మొదటి ఏడాదిలో 160 మంది చేరితే, ఈ ఏడాది 82 మంది మాత్రమే చేరారు. అంటే ఒక్కసారిగా 78 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఎమ్మిగనూరులో గతేడాది 278 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది 182 మంది మాత్రమే చేరారు. ఇక్కడ 96 మంది తగ్గిపోయారు. కర్నూలు జిల్లాలోని 16 కాలేజీల్లో ఇదే దుస్థితి నెలకొంది.
సాక్షి, అమరావతి: విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వాకంతో ప్రభుత్వ విద్యా రంగం తిరోగమన బాట పడుతోంది. విద్యకు సంబంధించి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను నీరుగార్చడంతో పాటు వికట ప్రయోగాలతో పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. ఫలితంగా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జూనియర్ కాలేజీల్లో చేరికలు భారీగా పడిపోయాయి.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే కాలేజీల్లో తరగతులు ప్రారంభించినా, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నా.. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరడం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 475 కాలేజీల్లో సగం సీట్లు ఖాళీగా ఉన్నాయి. పిల్లల సంఖ్య రెండంకెలు దాటని కాలేజీలు 200పైగా ఉన్నాయంటే సర్కారు ఇంటర్ విద్య దుస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.
2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 70,677 మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకుంటే, 2025–26 విద్యా సంవత్సరానికి అందులో మూడింట రెండో వంతు కంటే తక్కువగానే ప్రవేశాలు నమోదు కావడం కూటమి సర్కారు వైఫల్యానికి అద్దం పడుతోంది.
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం అమలు చేసినా, కొత్తగా ఎంబైపీసీ కోర్సును అందుబాటులోకి తెచ్చి, జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినా ఫలితం లేకపోయింది. అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తే సరిపోదని తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు.
రేషనలైజేషన్‌తో లెక్చరర్ పోస్టులు రద్దు
విద్యా సంబంధమైన మార్పులు చేసేటప్పుడు ఆ రంగంలోని నిపుణులతో కమిటీలు వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులు ఉన్న చోట నియమించాల్సిన లెక్చరర్లను అడ్మిషన్లు లేనిచోట నియమించడం, రేషనలైజేషన్ పేరుతో పోస్టులను రద్దు చేయడం వంటి చర్యలు ప్రభుత్వ కాలేజీలను ఖాళీ చేశాయి.
ఈ విద్యా సంవత్సరం లెక్చరర్ల ‘మిగులు’ (సర్‌ప్లస్) పేరుతో 455 పోస్టులను ఆయా కాలేజీల్లో రద్దు చేసి, విద్యార్థులు లేనిచోట నియమించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మరో 150 మంది లెక్చరర్లనూ సర్‌ప్లస్ చేసేందుకు ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసినట్టు సమాచారం.
కార్పొరేట్‌కు మేలు చేసేలా మార్పులు
ఓ కాలేజీలో కొత్త కోర్సులు, లేదా ఉన్న కోర్సుల్లో మార్పులు చేయాలంటే సంబంధిత కాలేజీ విద్యార్థులు, ప్రిన్సిపల్ అభిప్రాయాలు తీసుకోవాలి. తర్వాత ఆ కోర్సుల్లో ఎంత మంది విద్యార్థులు చేరుతారో నిపుణుల కమిటీ అంచనా వేస్తుంది. కానీ ఇవేమీ లేకుండానే కోర్సుల్లో మార్పులు చేసేశారు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల్లోనే అధికంగా లెక్చరర్లను సర్‌ప్లస్ చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల సన్నిహితులకు మేలు చేసేందుకు చేపట్టిన ఈ ప్రక్రియ కాస్తా కార్పొరేట్ కాలేజీలకు లాభించేలా మార్చేశారు. ఉదాహరణకు నెల్లూరులోని ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 200 మంది విద్యార్థులు ఉన్నారు, అత్యధిక మంది గ్రామీణ విద్యార్థులే. ప్రస్తుతం ఇక్కడ ద్వితీయ భాషగా తెలుగు కొనసాగుతోంది.
కానీ, ఈ ఏడాది ఓ ఉన్నతాధికారి సన్నిహితులైన హిందీ కాంట్రాక్టు లెక్చరర్ బదిలీ కాకుండా ఉండేందుకు తెలుగు భాష స్థానంలో ద్వితీయ భాషగా హిందీని చేర్చి ఆమెకు అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. దీంతో హిందీ ఇష్టం లేని విద్యార్థులు ఆర్థిక భారమైనా ప్రైవేటు కాలేజీ బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే అధికారులు ఎంత యత్నించినా అడ్మిషన్లు 40 వేలు దాటలేదు.

ఈ నెలాఖరు వరకు చూసినా కొత్తగా రెండు లేదా మూడు వేలు ప్రవేశాలు పెరగడం కూడా కష్టమేనని తెలుస్తోంది. వీటికి తోడు హైస్కూల్ ప్లస్‌లను ఇష్టానుసారంగా రద్దు చేస్తుండటం కూడా అడ్మిషన్లు పెరగక పోవడానికి ఓ కారణం. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఆరు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కలిపి రూ.6,400 కోట్లు బకాయి ఉండటం కూడా ప్రభుత్వంపై నమ్మకం పోయేలా చేసింది.
ఇవిగో నిదర్శనాలు
⇒ ఒంగోలు నగరంలో 100 మంది విద్యార్థులు కూడా లేని కాలేజీ (నాన్ శాంక్షన్)కి 13 మంది లెక్చరర్లను కేటాయించారు.
⇒ వైఎస్సార్ కడప జిల్లా లింగాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూప్‌లో 17 మంది విద్యార్థులు ఉండగా, ఇక్కడున్న జువాలజీ లెక్చరర్‌ను ఆరుగురు విద్యార్థులు ఉన్న ప్రొద్దుటూరు కాలేజీకి బదిలీ చేశారు. ఎక్కడ ఎక్కువ మంది విద్యార్థులుంటే అక్కడ లెక్చరర్లను నియమించాల్సింది పోయి కేవలం ఆరుగురు బైపీసీ విద్యార్థులు ఉన్న కాలేజీకి మార్చడం గమనార్హం.
⇒ నెల్లూరు జిల్లాలో 11 పోస్టులను రేషనలైజేషన్ ద్వారా తీసేశారు. నెల్లూరులోని 700 మంది విద్యార్థులు ఉన్న కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తొమ్మిది పోస్టులను రద్దు చేశారు.
⇒ నెల్లూరు డీకే కాలేజీలో 300 మంది కామర్స్ విద్యార్థులు ఉంటే ఇద్దరు కామర్స్ లెక్చరర్లలో ఒకరిని సర్‌ప్లస్ చేశారు.
⇒ సింగరాయకొండలో 300 మంది విద్యార్థులు ఉంటే ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టును రద్దు చేశారు. కొండెపిలోనూ ఇదే పరిస్థితి. చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ కాలేజీలో హిస్టరీ విద్యార్థులు 150 మందికి గతంలో ఇద్దరు లెక్చరర్లు ఉంటే ఇప్పుడు ఒక్కరిని సర్‌ప్లస్ చేశారు. పెనుమాక కాలేజీలో మొత్తం విద్యార్థులు 50 మందే (అధికంగా తెలుగు) ఉన్నా ఇక్కడ కొత్తగా ఉర్దూ లెక్చరర్‌ను ఇచ్చారు.
బోధనపై భరోసా లేక..
ఇంటర్ విద్య డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు పదో తరగతి పరీక్షలు అవగానే క్యాంపెయిన్ ప్రారంభించారు. పదో తరగతి హాల్ టికెట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం గురించి విస్తృత ప్రచారం చేశారు. బోధనపై మాత్రం భరోసా ఇవ్వలేకపోయారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో 2024తో పోలిస్తే 2025లో అడ్మిషన్లు భారీగా పడిపోయాయి.
⇒ కర్నూలు జిల్లా దేవనకొండ జూనియర్ కాలేజీలో గతేడాది ఇంటర్ మొదటి ఏడాదిలో 160 మంది చేరితే, ఈ ఏడాది 82 మంది మాత్రమే చేరారు. అంటే ఒక్కసారిగా 78 మంది విద్యార్థులు తగ్గిపోయారు.
⇒ ఎమ్మిగనూరులో గతేడాది 278 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది 182 మంది మాత్రమే చేరారు. ఇక్కడ 96 మంది తగ్గిపోయారు. ఒక్క కర్నూలు జిల్లాలో మొత్తం 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండు మినహా మిగిలిన 16 కాలేజీల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.
⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి బాలికల జూనియర్ కాలేజీలో గతేడాది 418 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది 285 మందే అడ్మిషన్లు తీసుకున్నారు. అంటే 133 మంది తగ్గిపోయారు. ఇక్కడ బాలుర కాలేజీలో గతేడాది 304 మంది చేరితే, ఈసారి 188 మంది మాత్రమే చేరారు. అంటే 116 అడ్మిషన్లు పడిపోయాయి. ఈ జిల్లాలో 18 కాలేజీల్లోనూ ఒక్క వెంకటగిరి కాలేజీలో తప్ప అన్ని కాలేజీల్లోను అడ్మిషన్లు తగ్గిపోయాయి.
⇒ నెల్లూరు జిల్లాలో గత విద్యా సంవత్సరం 3,500 మంది చేరితే, ఈ ఏడాది 2,185 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. నెల్లూరు నగరంలోని కేఏసీ కళాశాలలో 250 మంది, ఆత్మకూరులో 134, కందుకూరులో 131, కోవూరులో 109, ఉదయగిరిలో 100, మంది మినహా మిగతా కాలేజీల్లో ప్రవేశాలు 40 శాతం దాటలేదు.