సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక రాష్ట్రం ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 1 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అలాంటి నిర్ణయమే తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది. కర్ణాటక విధానాన్ని అధ్యయనం చేసి, రిజర్వేషన్ కల్పనపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని చెప్పింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ట్రాన్స్‌జెండర్ న్యాయపోరాటం
2018 నవంబర్‌లో జారీచేసిన ఎస్‌ఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ ట్రాన్స్‌జెండర్ గంగాభవాని 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దరఖాస్తులో స్త్రీ, పురుష ఐచ్చికాలు మాత్రమే ఉండటంతో తాను స్త్రీగా ఐచ్చికం ఇచ్చినట్లు తెలిపారు. రాతపరీక్షలో 35 శాతం మార్కులు సాధించినా తదుపరి ప్రక్రియకు తనను అనర్హురాలిగా ప్రకటించారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై గంగాభవాని 2022లో ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై గత ఏడాది విచారణ జరిపిన ధర్మాసనం గంగాభవానీకి ఉద్యోగం కల్పించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ని ఆదేశించింది.
తాజాగా ఈ అప్పీల్‌పై జస్టిస్ దేవానంద్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివప్రతాప్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాన్ని డీజీపీ తిరస్కరించారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లలో రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిపారు. ఇప్పటికే వందశాతం రిజర్వేషన్ల కోటా పూర్తయిందని చెప్పారు. ట్రాన్సజెండర్‌ల విషయంలో ప్రభుత్వం 2017లో ఓ విధానం తీసుకొచి్చందని, అయితే రిజర్వేషన్లను మాత్రం ఇప్పటివరకు అమలు చేయలేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. రిజర్వేషన్లు లేకుండా పాలసీలు రూపొందిస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించింది.
పిటిషనర్ న్యాయవాది సాల్మన్‌రాజు వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ లేకపోవడంతో ఫీమేల్ ఆప్షన్ ఎంచుకున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ రిజర్వేషన్ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు 1 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆ రాష్ట్రం రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించింది. ఏఏజీ సాంబశివప్రతాప్ స్పందిస్తూ.. దీనిమీద అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.


