
ఇచ్చేది రూ.13 వేలే.. ఏకంగా 30 లక్షల మందికిపైగా ఎగనామం
యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో విద్యార్థులు 87,41,885
ఇప్పుడు మీరు ఇస్తామంటున్నది 54,94,703 మందికే..
సవాలక్ష ఆంక్షలతో పిల్లల సంఖ్య ఇంకా తగ్గించే కుట్ర
జూలై 5న తల్లుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నది ఇందుకే
ఇంట్లో ఎవరైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందితే వందనం ఇవ్వరట
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే అతీగతీ లేదు.. దాని పేరుతో ఇంకో పథకం కోత
విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటితే పథకం కట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్‌షిప్ పొందుతున్న వారూ అనర్హులే
కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు
నెలవారీ ఆదాయం రూ.10–12 వేలు మించితే పథకం ఇవ్వరు
1000 చదరపు అడుగుల స్థలం ఉన్నా, కారు ఉన్నా వర్తించదు
తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం.
– ఎన్నికలప్పుడు నారా చంద్రబాబు నాయుడు
ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు.. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం.
– ఎన్నికలప్పుడు నారా లోకేశ్
విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్‌లోడ్ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ.8,745 కోట్లే. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు.
ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా! ఎప్పుడొస్తుందో తెలియని.. అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నెపం మోపి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా?
ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో (సాక్షి మినహా) ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేస్తామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా సవాలక్ష నిబంధనలు పెట్టి, నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు! దీన్ని ఏమనాలి? మోసం అనాలా.. లేక దగా అనాలా?
వీరందరూ అనర్హులు
⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.
⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు.
⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.
⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.
⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు.
⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.
⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి
పథకం రాదు.
⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్‌ృమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు.
⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.
సాక్షి, అమరావతి: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం.. వచ్చే నెలకు వాయిదా వేసింది.
కేవలం విధివిధానాలు మాత్రమే విడుదల చేసి అనేక కఠిన నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెట్టే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలు ఉన్న వారిని తొలగించనున్నారు. అర్హులుగా తేలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వచ్చే నెలలో రూ.13 వేలు మాత్రమే జమ చేస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (26, 27 జీవోలు) విడుదల చేసింది.
ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ పథకం వర్తిస్తుందని, ఈ ఏడాది హాజరుతో సంబంధం లేకుండా అన్ని మేనేజ్‌మెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ పథకం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తీరా తల్లులపై ఫీజుల భారం మోపింది.
ఇచ్చేది 54,94,703 మందికే..
ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్–6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 67,27,164 మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా, ప్రస్తుతం ఇచ్చేది 54,94,703 మందికేనని తేల్చింది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం లబ్ధిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఒకటో తరగతిలో 5,87,265 మంది, జూనియర్ ఇంటర్‌లో 5,32,485 మంది చేరుతారని అంచనా వేశారు. రికార్డుల్లో తప్పులున్నవారు 21,860 మంది, కుటుంబ వివరాలు లేని వారు 90,851 మంది ఉన్నట్లు అంచనా.
వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన 15 కార్పొరేషన్ల ద్వారా గుర్తించిన 54,94,703 మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిబంధనలు అన్నీ సరిపోతే.. ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల 5న ఆయా విద్యార్థులకు సంబంధించి 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 75 శాతం హాజరు ఉన్న వారికే 2027లో పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.
నాలుక మడతేసిన లోకేశ్!
వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మఒడి అమలులో కఠిన నిబంధనలు పెట్టిందని ఎన్నికలప్పుడు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ నీతులు వల్లించారు. కానీ ప్రస్తుతం తల్లికి వందనం అమలు నిబంధనలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటికే రెండేళ్ల కాలానికి విద్యార్థులకు తల్లికి వందనం వేయాలి. కానీ తేదీల మతలబుతో మాయ చేసి 2026కు ఇప్పుడు ప్రకటించారు. అదీ 67,27,164 మంది లబ్ధిదారులని చెప్పి, ఇచ్చేది మాత్రం 54,94,703 మందికేనని.. కండిషన్స్ అప్లై అన్నారు.
గత ప్రభుత్వంలో 75 శాతం హాజరు నిబంధన పెట్టినా పేదల పక్షపాతి అయిన నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు. అయితే నాటి నిబంధనలను తప్పుబట్టిన లోకేశ్.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకు కోత పెట్టారు. ఇప్పుడు అర్హులైన వారికి రూ.13 వేలు మాత్రమే ఇస్తామని, మరో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తామంటున్నారు.
ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. చేసిందేమిటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా లోకేశ్‌ను నిలదీస్తున్నారు. పైగా ఈ పథకాన్ని 2024 జూన్/జూలైలో విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎగవేశారు. 2025 జూన్‌లో ఇవ్వాల్సిన పథకాన్ని ఇప్పుడు ప్రకటించి 2026కు కూడా ఇదే అని చెబుతున్నారు.
పైగా ఒక ఇంట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారు. అమ్మ ఒడి కూడా ఇచ్చారు. ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మ ఒడిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్.. ఇప్పుడు ఇన్ని కండిషన్లతో తల్లికి ఎగనామం పెట్టినట్టు కాదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు.